Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అరెస్టు: పదేళ్లకంటే ఎక్కువ శిక్ష పడే కేసు ఇది-ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (13:59 IST)
స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను స్కామ్ చేసేందుకే ప్రారంభించారని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. ఇందుకోసం నాటి కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ కార్పొరేషన్‌ను తీసుకొచ్చిన చంద్రబాబు, గంటా సుబ్బారావుకు ఈ సంస్థ బాధ్యతలు అప్పగించారన్నారు. అంతేకాక ఈ సుబ్బారావుకు CM సలహాదారు, ఉన్నత విద్యాశాఖలో ఉన్నత హోదా సహా నాలుగు పదవులు ఇచ్చారన్నారు. ఈయన ద్వారా బాబు నిధులు మళ్లించేలా వ్యూహం రచించారని వివరాలు వెల్లడించారు.
 
‘‘ఇది రూ. 550 కోట్ల స్కామ్. ప్రభుత్వానికి రూ.371 కోట్ల నష్టం వచ్చింది. నకిలీ ఇన్‌వాయిస్ ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. ఇందులో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడే. ఇందులో జరిగిన లావాదేవీలన్నీ ఆయనకు తెలుసు. ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు. దీనిపై ఈడీ, జీఎస్టీ ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేశాయి.’’ అన్నారు సంజయ్. ‘‘ఈ స్కాంలో ఫైనల్ బెనిఫిషరీ కూడా చంద్రబాబే. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశాo. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందే. నిధులు దారి మళ్లింపుకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. 2014 జూలై నాటికే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ముందే డిజైన్ టెక్‌తో ఒప్పందం కుదిరింది. క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు’’ అని సంజయ్ వెల్లడించారు. ఇది కనీసం పదేళ్ల జైలు శిక్ష పడే కేసు అని సంజయ్ అన్నారు.
 
చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని సంజయ్ తెలిపారు. ఓర్వకల్లు నుంచి విజయవాడకు హెలికాప్టర్లో తరలిస్తామని చెప్పామని, కానీ, చంద్రబాబు తిరస్కరించారని ఆయన వెల్లడించారు. ఆయన వయసు, ఆరోగ్యం, హోదా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబును గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడ తరలిస్తున్నారు. అరెస్టు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. ఆయన ఛాతిలో అసౌకర్యంగా ఉన్నట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు.
 
చంద్రబాబుకు బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నం చేస్తున్నామని, ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని న్యాయవాది అన్నారు. ఇటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఇదే కేసులో అరెస్ట్ చేశారు. తెల్లవారు జామున ఆయన నివాసానికి చేరుకున్న దిశ ఏసీపీ వివేకానంద, గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.
 
లోకేశ్ ఆగ్రహం
యువగళం పాదయాత్రలో బాగంగా ప్రస్తుతం లోకేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ క్యాంపులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ గురించి తెలియగానే ఆయన విజయవాడ వెళ్లేందుకు బయల్దేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించడంతో నోటీసుల్ని తిరస్కరించారు. దీంతో లోకేశ్ అక్కడే నేలపై కూర్చుని నిరసన చేపట్టారు. పోలీసులకు రాజ్యాంగాన్ని చూపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం తనకు ఎక్కడైనా స్వేచ్చగా తిరిగే హక్కు ఉందని వాదించారు. తండ్రిని చూసేందుకు బయల్దేరిన కొడుకుని అడ్డుకుంటారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఏపీలో పలు చోట్ల ఉద్రిక్తతలు
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతల గృహ నిర్భంధంలోకి తీసుకుంటున్నారు. అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో అధికారులు బస్సులు నిలిపివేస్తున్నారు. విశాఖలోని ద్వారకా బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులు నిలిపివేశారు. విజయవాడలోని పలు కూడళ్లలో పోలీసులను మోహరించారు.
 
చంద్రబాబు అరెస్ట్‌పై ఎవరేమన్నారు?
కావాలని శాంతి భద్రతల చెడగొడుతున్నారు: పవన్ కల్యాణ్
ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంభిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గతేడాది అక్టోబర్‌లో విశాఖపట్నంలో జనసేన పట్ల కూడా ఏపీ పోలీసులు ఈ విధంగానే ప్రవర్తించారని ఆయన గుర్తు చేశారు. ‘‘ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలులో పెట్టారు. నంద్యాలలో చంద్రబాబు నాయుడి అరెస్టు కూడా ఇలాంటిదే. ఆయన అరెస్ట్‌ను మేం ఖండిస్తున్నాం.
 
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకు మద్దతుగా అనుచర వర్గం బయటకు రావడం ప్రజాస్వామ్యంలో మామూలే. వారు అలా బయటకు రావొద్దనడం ఎంతవరకు సమంజసం. ఇదంతా ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలాగే మేం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుకు జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుంది’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
 
చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరీ స్పందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఆమె ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. బీజేపీ దీన్ని ఖండిస్తోంది’’ అని ఆమె రాశారు.
 
వైకాపా అరాచకాలకు పరాకాష్ట ఈ అరెస్ట్: సీపీఐ నారాయణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరాకాష్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. శనివారం ఉదయం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఎటువంటి ఆధారాలు చూపకుండా పోలీసులు అరెస్ట్ చేయడం వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతోంది. రివర్స్ టెండెరింగ్, రివేంజ్ అనే రెండు రకాల పాలనను వైసీపీ అనుసరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తుండటం దుర్మార్గం. కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
 
జగన్ పాలకుడు కాదు కక్షదారుడు: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
చంద్రబాబు అక్రమ అరెస్ట్ దుర్మార్గమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్షనేతలపై కక్షసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని ఒక పత్రిక ప్రకటనలో బాలకృష్ణ పేర్కొన్నారు. ‘‘జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష సాధిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? ఇది రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర.’’ అని ఆయన అందులో అన్నారు. ‘‘జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం’’ అని బాలకృష్ణ తన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
 
ఇది రాజకీయ కక్ష కాదు: ప్రభుత్వ సలహాదారు సజ్జల
ఈ కేసు రెండేళ్ల కిందటే నమోదైందని, దీన్ని రాజకీయ కక్షపూరిత చర్య అనడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇది నిజంగా రాజకీయ కక్షపూరిత చర్య అయితే చంద్రబాబు ఎప్పుడో అరెస్టయ్యేవారని ఆయన అన్నారు. అన్ని రకాలుగా విచారణ జరిపిన తర్వాతనే చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారని ఆయన అన్నారు. ‘‘చంద్రబాబు తప్పు కప్పి పుచ్చుకునేందుకు రాజకీయం చేస్తున్నారు. స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 371 కోట్లలో 240 కోట్లు దారి మళ్లినట్లు 2017,18లోనే ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు తన నిజాయతీ నిరూపించుకోవాలి. విచారణ ఎదుర్కోవాలి. చంద్రబాబుపై కేసు బలంగా ఉంది’’ అని సజ్జల అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?

విల్ స్మిత్‌తో $50 మిలియన్ మీడియా ఫండ్ కోసం విష్ణు మంచు చర్చలు

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ పాత్ర చెప్పగానే వద్దకున్నా: శ్రీకాంత్

అల్లు అర్జున్ కలిసిన ఉపేంద్ర.. మంచి మనిషి అని కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments