Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘శివ శక్తి, తిరంగా’ పేర్లకు ఐఏయూ ఒప్పుకుంటుందా? చంద్రుడిపై ప్రదేశాలకు పేర్లు ఎలా పెడతారు?

chandrayaan-3
, బుధవారం, 30 ఆగస్టు 2023 (21:31 IST)
చంద్రయాన్ -3 మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) పంపిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా వాటి పని అవి చేస్తున్నాయి. చంద్రయాన్-3 మిషన్‌లో పంపిన ల్యాండర్ విక్రమ్ దిగిన ప్రదేశానికి 'శివ శక్తి' పాయింట్ అని, చంద్రయాన్ -2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి 'తిరంగా’ పాయింట్ అని పేరు పెడుతున్నట్లు ఆగస్టు 26న బెంగళూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది దేశంలో కొత్త వివాదానికి తెరలేపింది. ఈ పేర్లపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇస్రో శాస్త్రీయ పరిశోధనలను రాజకీయం చేయొద్దంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.
 
కానీ, చంద్రయాన్-1 ప్రోబ్ క్రాష్ అయిన ప్రదేశానికి ‘జవహర్ పాయింట్’ అని పేరు పెట్టాలని అప్పట్లో కాంగ్రెస్ డిమాండ్ చేసిందని బీజేపీ ఆధారాలతో ఎత్తిచూపుతోంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ప్రదేశాలకు పేర్లు పెట్టడంపై నెలకొన్న ఈ వివాదంతో, అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రుడిపై ప్రదేశాలకు పేర్లు ఎవరు పెడతారు? ఎలా పెడతారు? మతపరమైన, రాజకీయపరమైన పేర్లు పెట్టొచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
 
ఐఏయూ- పేర్లను ఆమోదించేది ఇదే
1969 నుంచి చంద్రుడిపై ఎన్నో మానవ సహిత, మానవ రహిత ప్రయోగాలు జరిగాయి. చంద్రుడిపై ప్రయోగించే స్పేస్ క్రాఫ్ట్స్, ప్రోబ్స్, ల్యాండర్ దిగిన ప్రదేశాలు, చుట్టుపక్కల ఉన్న పర్వతాలు, లోయలకు పేర్లు పెట్టడం కూడా అప్పట్లోనే ప్రారంభమైంది. అయితే, ఈ పేర్లను ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్(ఐఏయూ) ఆమోదించింది. ఇది చంద్రుడితో పాటు సౌర వ్యవస్థలోని గ్రహాలకు కూడా వర్తిస్తుంది. ఐఏయూ వర్కింగ్ గ్రూప్ 'ప్లానెటరీ సిస్టమ్ నామెన్‌క్లేచర్‌' గ్రహాలపై ప్రదేశాలకు అధికారిక పేర్లను కేటాయించే బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
 
ఈ విభాగం 2021 వరకూ దాదాపు 85 ప్రదేశాలకు పేర్లు ఖరారు చేస్తూ జాబితా తయారుచేసింది. అంతరిక్ష పరిశోధనకు సిద్ధమవుతున్న దేశం ముందుగా ఈ సంస్థకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు, ప్రయోగం వివరాలు పరిశీలించిన అనంతరం ఐఏయూ సంస్థ వారి దరఖాస్తును ఆమోదిస్తుంది. ఇస్రో ప్రయోగించిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగింది. దక్షిణ ధ్రువంలో ఉన్న చాలా పర్వతాలు, లోయలకు ఇప్పటికే పేర్లు ఉన్నాయి. శివ శక్తి, తిరంగా పాయింట్ పేర్లకు ఐఏయూ ఆమోదం లభిస్తేనే అధికారిక పేర్లుగా భావించాల్సి ఉంటుంది.
 
పేర్లు పెట్టడానికి ఐఏయూ నిబంధనలు ఇవీ
సౌర వ్యవస్థలోని గ్రహాలు, చంద్రుడిపై ఉన్న భౌగోళిక ప్రదేశాలకు పేర్లు పెట్టేందుకు ఐఏయూ నిబంధనలు పెట్టింది. ఐఏయూకి చెందిన 'గెజిటీర్ ఆఫ్ ప్లానెటరీ నామెన్‌క్లేచర్' వెబ్‌సైట్‌లో 14 నిబంధనలు ఉన్నాయి. వాటిలో ఏడు ముఖ్యమైన నిబంధనలు ఇలా ఉన్నాయి.
 
1. పేర్లు చాలా క్లుప్తంగా, సాధారణంగా ఉండాలి.
2. పేర్ల కోసం ఆథరైజ్డ్ సంస్థ మాత్రమే దరఖాస్తు చేయాలి.
3. శాస్త్రీయంగా, సాంస్కృతికపరమైన అర్థం ఉండేలా పేర్లు ఉండాలి.
4. రాజకీయ, సైనిక, మతపరమైన అర్థాలు ఉండకూడదు. అలాగే 19వ శతాబ్దం తర్వాతి కాలానికి చెందిన ఏ రాజకీయ నేత పేరు పెట్టకూడదు.
5. గ్రహాలపై ఉన్న భౌగోళిక లక్షణాలను అనుసరించి పేర్లు పెట్టుకోవచ్చు.
6. వ్యక్తుల పేర్లు పెట్టడం వల్ల ఎలాంటి అపోహలు తలెత్తకూడదు. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపు పొందిన వారి పేర్లను సానుకూలంగా పరిగణిస్తారు. అయితే, అలాంటి ప్రతిపాదనలు చేసే సమయానికి ఆ పేరు ఉన్నవారు చనిపోయి కనీసం మూడేళ్లు పూర్తై ఉండాలి.
7. ఆంగ్ల పదాల వ్యాకరణం, నిర్మాణంలో తప్పులు ఉండకూడదు. అలాగే, ఆ పదాల అర్థాలు అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉండాలి.
 
ఆ పేర్లు ఎక్కడ కనిపిస్తాయి?
చంద్రుడిపై ప్రదేశాలకు పెట్టిన పేర్లను చంద్రుడి మ్యాప్‌పై సూచిస్తారు. ఈ మ్యాప్‌ను ఐఏయూ ప్లానెటరీ నేమ్స్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ వెబ్‌సైట్‌లో నాలుగు వేర్వేరు మ్యాప్‌లు ఉన్నాయి. వీటిలో నియర్ సైడ్ (భూమిపై నుంచి కనిపించే ప్రాంతం) మ్యాపు, ఫార్ సైడ్ (భూమిపై నుంచి కనిపించని ప్రాంతం) మ్యాపు, ఉత్తర ధ్రువం మ్యాపు, దక్షిణ ధ్రువం మ్యాపు ఉన్నాయి. చంద్రుడిపై పలు ప్రదేశాలకు పెట్టిన పేర్లు ఈ మ్యాప్‌లపై ఉన్నాయి. ఈ పేర్లను ఎవరు ఖరారు చేస్తారు? ఎందుకు? అనే వివరాలు కూడా గెజిటీర్ ఆఫ్ ప్లానెటరీ నామెన్‌క్లేచర్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అందులో ప్రతి పేరు, దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది.
 
చంద్రుడిపై దిగిన ప్రదేశాన్ని స్టేషన్ అంటారా?
మహారాష్ట్ర టైమ్స్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, ఎక్కడైతే అంతరిక్ష నౌక(స్పేస్ క్రాఫ్ట్) దిగుతుందో, దానిని స్టేషన్‌గా వ్యవహరిస్తారు. స్టేషన్ అనేది ఒక లాటిన్ పదం. ప్రదేశం అని దానర్థం. అందువల్ల, అమెరికా అపోలో 11 మిషన్ దిగిన ప్రదేశాన్ని 'స్టేషన్ ట్రాంక్విలిటీ'గా వ్యవహరిస్తున్నారు. 1973లో దాన్ని గుర్తించారు. చైనా స్టేషన్‌‌ను టియాన్హీగా వ్యవహరిస్తారు. 2019లో దానికి గుర్తింపు లభించింది. ఒక్క అపోలో 13 వ్యోమనౌకను మినహాయిస్తే, అపోలో 11 నుంచి అపోలో 17 వరకు వ్యోమగాములు వెళ్లిన అంతరిక్ష నౌకలు ల్యాండ్ అయిన ప్రదేశాలను ఐఏయూ గుర్తించింది.
 
శివశక్తి, తిరంగా పాయింట్‌పై చర్చ ఎందుకు?
''చంద్రుడి ఉపరితలంపై ఉన్న ప్రదేశాలకు శివ శక్తి లేదా తిరంగా పాయింట్ అని పేర్లు పెట్టే అధికారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేదు. ఆయన చేసిన పనికి ప్రపంచం మొత్తం నవ్వుతోంది. చంద్రుడిపై ప్రదేశాలకు పేరు పెట్టే అధికారం మోదీకి ఎవరిచ్చారు? చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవడం చాలా మంచి విషయం. అంతమాత్రాన చంద్రుడికి, లేదంటే చంద్రుడిపై ఆ ప్రదేశానికి యజమాని అయినట్టు కాదు'' అని కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో అన్నారు. అల్వీ విమర్శలకు బీజేపీ బదులిచ్చింది.
 
''కేవలం కాంగ్రెస్ మాత్రమే తన హిందూ వ్యతిరేక స్వభావాన్ని బయటపెడుతోంది. ఈ పార్టీనే రాముడి ఉనికిని ప్రశ్నించింది. రాముడి ఆలయాన్ని వ్యతిరేకిస్తారు. హిందువులను దూషిస్తారు. శివ శక్తి, తిరంగా పాయింట్ అనే పేర్లు దేశంతో ముడిపడి ఉన్న పేర్లు. చంద్రయాన్ 1 మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌‌ చేరిన ప్రదేశానికి జవహర్ పాయింట్ అని పేరు పెట్టాలని ఇదే కాంగ్రెస్ డిమాండ్ చేసింది'' అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.
 
ఈ నేపథ్యంలో, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ మీడియా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ''నరేంద్ర మోదీ ఈ దేశానికి ప్రధాన మంత్రి. ఆయనకు ప్రత్యేక అధికారాలున్నాయి. కాబట్టి ఆ పేరును పెట్టుకోవచ్చు. ప్రధాని మాతో మాట్లాడుతూ దాని అర్థం ఏంటో చెప్పారు. అది ఎలా ఉపయోగపడుతుందో కూడా వివరించారు. అందులో తప్పుబట్టాల్సిన అవసరం ఉందని మేము అనుకోవడం లేదు'' అని సోమనాథ్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యక్తి ప్రాణాలను కాపాడి హీరో అయిన ట్రాఫిక్ పోలీస్ అధికారి