Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీసీ కెమెరా: అడుగడుగున నిఘా, మానవ హక్కుల ఉల్లంఘనా? లేక భద్రత కోసం అనివార్యమా?

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (16:49 IST)
భద్రత, నేరస్తులను పట్టుకునే విషయంలో సీసీ కెమెరాల పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కేసుల్ని పరిష్కరించడంలో పోలీసులకు అవి చేసే సాయం అంతా ఇంతా కాదు. భద్రత సరే. కానీ, ఆ పేరుతో మన జీవితాల్లోకి కెమెరాలు, అధికార యంత్రాంగం చొరబడుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అంటోంది అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజా నివేదిక. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా సంగతెలా ఉన్నా, అసలు వీటి వినియోగమే అనుమానాస్పదంగా మారిందని మానవ హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా భద్రత కోసం తప్ప మరొకటి కాదని పోలీసులు చెబుతున్నారు.

 
సీసీ కెమెరాల నీడలో...
తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న పట్టణాల నుంచి మహా నగరాల వరకు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. హైదరాబాద్ వంటి మహానగరంలో అయితే అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా కనిపిస్తూ ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల అనుక్షణం మనల్ని ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని అమ్నెస్టీ చెబుతోంది. వీటి నిఘా వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది ఆ సంస్థ అభిప్రాయం.

 
ప్రపంచవ్యాప్తంగా "బ్యాన్ ది స్కాన్" అనే పేరుతో ఇటీవల నిర్వహించిన క్యాంపెయిన్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, అలాగే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకం చాలా ఎక్కువగా జరుగుతోందని ఆమ్నెస్టీ పేర్కొంది. సామాన్య పౌరుడిపై అడుగడుగునా నిఘా పెట్టడం, స్కాన్ చేయడం మానవ హక్కులకు విరుద్ధం అన్నది ఆ సంస్థ మాట. "హైదరాబాద్ పూర్తి నిఘా వలయంలోకి జారుకుంటోంది. ముఖ్యంగా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత వల్ల మనం ఎవరమన్నది పోలీసులకు తెలీకుండా అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది" అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బిగ్ డేటా రిసెర్చర్‌గా వ్యవహరిస్తున్న మాట్ మహామౌది బీబీసీతో అన్నారు.

 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి భద్రత విషయంలో సీసీ కెమెరాల వినియోగంపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. వీటి ద్వారా సేకరించిన డేటాను భద్రపరుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం కూడా భద్రతా చర్యల్లో భాగమే. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన డేటా సహా ఇతర ముఖ్యమైన వివరాలన్నింటిని ఈ సెంటర్లో అత్యంత భద్రంగా ఉంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే ఇప్పుడు ఇలా డేటాను సేకరించడంపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 
నిఘా పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చా?
సీసీ కెమెరాలు వద్దనడం లేదు, కానీ ఇవి ఎవరి ఆధీనంలో ఉన్నాయన్నది ప్రశ్న. వాటి నుంచి సేకరించే డేటాను ఎలా, ఎప్పుడు, ఎందుకు వాడుతున్నారన్నదే సమస్య అంటున్నారు వీటిని వ్యతిరేకించే వాళ్లు. "సీసీ కెమెరాలతో నేరాల సంఖ్య తగ్గుతుంది అనేకంటే, నేరం జరిగిన తరువాత ఆ కేసుల విచారణకు అవి ఉపయోగ పడుతున్నాయనడం వాస్తవం. పోలీసుల దగ్గర తుపాకులున్నా వాటి ఉపయోగంపై ఆంక్షలు ఉన్నాయి. సీసీ కెమెరాలకు అలాంటిదేమీ లేదు'' అని మానవ హక్కుల కార్యకర్త శ్రీనివాస్ కొడాలి బీబీసీతో అన్నారు.

 
''సీసీటీవీ కెమెరాలు ఎప్పుడు, ఎందుకు ఎలా వాడాలో కూడా చట్టబద్దంగా ఉండాలి. 2013 పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలు పెట్టాలన్న నిబంధన లేదు. కానీ, పోలీసులు మాత్రం అపార్ట్‌‌మెంట్లలో సీసీ కెమెరాలు లేకపోతే ఏ నేరం జరిగినా మాకు సంబంధం లేదని చెబుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగానే విచారణలు చేస్తున్నారు. పోలీసులు పూర్తిగా పోలీసింగ్ మర్చిపోయారు. అంటే సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తేనే అది నేరం అనే పరిస్థితికి వచ్చేశాం" అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

 
''ఇటీవల మా కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌‌లో దొంగలు పడ్డారు. పోలీసులు మా అపార్ట్‌మెంట్‌కు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారా? అని వాకబు చేశారు. లేదని చెప్పగా వెంటనే కెమెరాల ఏర్పాటుకు అసోసియేషన్‌లో నిర్ణయం తీసుకోండని చెప్పివెళ్లారు'' అని హైదరాబాద్ మణికొండ సమీపంలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో నివాసముండే సత్యనారాయణ బీబీసీతో చెప్పారు. "నేను ఉదయం బయటకు వెళ్లినప్పటి నుంచి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కొన్ని వందల కెమెరాలతో పోలీసులు నాపై నిఘా ఉంచుతారన్నమాట" అన్నారు హైదరాబాద్‌కి చెందిన మానవహక్కుల కార్యకర్త మసూద్.

 
కేవలం సీసీ కెమెరాలను మాత్రమే కాదు ఇటీవల ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని కూడా హైదరాబాద్ పోలీసులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్నది ఆమ్నెస్టీ వాదన. ''సామాన్య పౌరుల్ని ఎక్కడికక్కడ ఆపి, వారి ఫొటోలను తీసుకోవడం బాధాకరం'' అని ఆమ్నెస్టీ తన రిపోర్టులో పేర్కొంది.

 
తెలంగాణలో ఎన్ని, హైదరాబాద్‌లో ఎన్ని?
సీసీ కెమెరా నిఘా విషయంలో హైదరాబాద్ ప్రపంచంలోనే 16వ స్థానంలో, దేశంలో మొదటిస్థానంలో ఉందని తెలంగాణ పోలీసులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది రాష్ట్ర హోంమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలో 6.5 లక్షల కెమెరాలు ఉన్నాయి. తెలంగాణ మొత్తం మీద సుమారు 8.3 లక్షల సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి.

 
సామాన్యులేమంటున్నారు?
సీసీ కెమెరాలు ఉండటం వల్ల తమ అపార్ట్‌మెంట్‌లో భద్రత పెరిగిందని హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని సన్‌సిటీలో నివాసముంటున్న పి. జానకి రామ్ అభిప్రాయపడ్డారు. సీసీ కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అంతా బాధ్యతగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌ నగరానికే చెందిన పవన్ అభిప్రాయం కూడా అదే. నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న ఆయన, సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ప్రజల్ని స్కాన్ చేస్తున్నారనడంకన్నా వారిని కాపాడేందుకు ఉపయోగించుకుంటున్నారు అనడం సమంజసం అని పవన్ అభిప్రాయపడ్డారు. మనం బయటకు వెళ్ళినప్పుడు, సమాజంలో మనం ఎలా వ్యవహరిస్తున్నాం అన్నదానిపై నిఘా ఉండడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

 
పోలీసుల వాదనేంటి?
100 మందికి పైగా ప్రజలు గుమిగూడే ఏ ప్రదేశంలోనైనా అది గుడి, బడి, ఆస్పత్రి, బస్టాండు, రైల్వే స్టేషన్, సినిమా హాల్, కమర్షియల్ ఏరియా, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు జరిగే ప్రాంతాలు.... ఇలా ఎక్కడైనా సీసీ కెమెరాలు అమర్చాలని 2013 పబ్లిక్ సేఫ్టీ చట్టంలో ఉందని పోలీసులు చెబుతున్నారు. ‘‘దేశ జనాభా ప్రకారం ఆ స్థాయిలో ప్రతిచోటా పోలీసుల్ని మొహరించలేం. అందుకే సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నాం. కేసుల్ని వేగంగా ఛేదించడంలో ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి’’ అని హైదరాబాద్‌కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి బీబీసీతో అన్నారు. ఆయన తన పేరు ప్రచురించడానికి ఇష్టపడలేదు.

 
నగరంలో ఎక్కువగా సీసీ కెమెరాలు ప్రైవేటు వ్యక్తులే ఏర్పాటు చేసుకుంటారని, అవసరమైనప్పుడు మాత్రమే వారి నుంచి ఫుటేజీని సేకరిస్తాం తప్ప వాటిపై మాకు ఎలాంటి నియంత్రణ ఉండదని ఆ అధికారి వెల్లడించారు. ‘‘అంత డేటాను భద్రపరచడం సామాన్యమైన విషయం కాదు. చాలా ఖర్చవుతుంది కూడా" అని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments