కెఫే కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్ధ మృతదేహం నేత్రావతి నది ఒడ్డున్న కనుగొన్నట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ ధ్రువీకరించింది. వీజీ సిద్ధార్థ మృతదేహం మంగళూరు సమీపంలోని హోగే బజార్ వద్ద నేత్రావతి నది ఒడ్డున లభించిందని ఏఎన్ఐ తెలిపింది. మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిపై ఉన్న బ్రిడ్జి సమీపంలో కెఫే కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ మృతదేహాన్ని కొందరు జాలర్లు బుధవారం ఉదయం 7 గంటల సమయంలో గుర్తించారు.
సిద్ధార్థ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ట అల్లుడు. "సిద్ధార్థ కనిపించకుండా పోయిన ప్రాంతానికి సమీపంలోనే ఆయన మృతదేహాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించారు. మృతదేహాన్ని శవ పరీక్షల కోసం హాస్పటల్‌కు తీసుకెళ్తున్నాం" అని సంఘటన స్థలంలో ఉన్న మాజీ మంత్రి యూటీ ఖాదర్ బీబీసీకి తెలిపారు. మంగళవారం రాత్రంతా ఖాదర్ అక్కడే ఉండి సిద్ధార్థను కనుగొనేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
"ముఖంపై రక్తపు మరకలున్నాయి. కానీ శరీరంపై ఎక్కడా గాయాలు లేవు. వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది" అని ఖాదర్ తెలిపారు. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో సిద్ధార్థ అదృశ్యమయ్యారు. తాను కొద్దిదూరం నడిచి వస్తానని చెప్పి, డ్రైవర్‌ను బ్రిడ్జి సమీపంలో కారు ఆపమని చెప్పిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అరగంట గడిచినా సిద్ధార్థ కారు దగ్గరకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డ్రైవర్ బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
"ఈరోజు ఉదయం మృతదేహాన్ని కనుగొన్నాం. అయితే ఇది సిద్ధార్థదేనా కాదా అనేది గుర్తించాల్సి ఉంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. మృతదేహాన్ని వెన్లాక్ హాస్పటల్‌కు తరలిస్తున్నాం. విచారణను కొనసాగిస్తాం" అని మంగళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు.
ఆత్మహత్యకు ముందు రాసినదిగా భావిస్తున్న లేఖ నిజమైనదేనని పోలీసులు స్పష్టం చేశారు. కెఫే కాఫీ డే కుటుంబం, డైరెక్టర్లను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో... "తాను ఎంతోకాలం పోరాడానని, కానీ ఈరోజు ఆ పోరాటాన్ని వదిలేస్తున్నాను. భాగస్వాముల నుంచి, రుణాలిచ్చిన ఇతర వ్యక్తుల నుంచి ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. ఆదాయపన్ను శాఖ డైరెక్టర్ జనరల్ ఒకరి నుంచి వేధింపులు భరించలేకపోతున్నాను. అందుకే నా పోరాటం ఆపేస్తున్నా" అని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. తాము చేపట్టే చర్యలను సమర్థించుకుంటూనే, ఈ లేఖ నిజమైనది కాదేమో అనే అనుమానం వ్యక్తం చేసింది. తమ రికార్డుల్లో ఉన్న సిద్ధార్థ సంతకం ఈ లేఖలో ఉన్న సంతకంతో సరిపోవడం లేదని స్పష్టం చేసింది. "ఇది సరైన చర్య కాదు. జరిగిన తప్పులన్నింటికీ నేనే బాధ్యుడిని. మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదో ఒకరోజు మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా" అని సిద్ధార్థ తన లేఖలో పేర్కొన్నారు.
ప్రజలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, తీర ప్రాంత పోలీసు సిబ్బంది, కోస్ట్ గార్డులు... ఇలా 400కు పైగా సిబ్బంది సిద్ధార్థ మృతదేహాన్ని అన్వేషించే ఆపరేషన్‌లో పాల్గొన్నారు.