Webdunia - Bharat's app for daily news and videos

Install App

సకాలంలో చికిత్సతో రొమ్ము కేన్సర్ పై విజయం

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (05:30 IST)
సంపూర్ణ అవగాహన, దృఢమైన సంకల్పంతో పాటు సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్‌పై విజయం సాధించవచ్చని ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ పేర్కొన్నారు.

రొమ్ము కేన్సర్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్, ఎన్ఆర్‌ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆంధ్ర లయోలా వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వాకథాన్ నిర్వహించారు. పింక్ బెలూన్లు గాల్లోకి ఎగరవేయడంతో ఆరంభమైన ఈ వాకథాన్ లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.

లయోలా కళాశాల వద్ద ప్రారంభమైన ఈ వాకథాన్.. యలమంచిలి కాంప్లెక్స్, గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్, డెంటల్ కాలేజీ మీదుగా తిరిగి లయోలా కళాశాలకు చేరుకోవడంతో ముగిసింది. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఉపేంద్రనాథ్ మాట్లాడుతూ కేన్సర్లతో బాధపడుతోన్న మహిళల్లో 27 శాతం రొమ్ము కేన్సర్ బాధితులేనని అన్నారు.

ఏటా 1.63 లక్షల కొత్త కేసులు నమోదవుతుంటే, అందులో 87 వేల మంది మహిళలు మరణిస్తున్నారని తెలిపారు. అంటే ప్రతి పదినిమిషాలకో మహిళ రొమ్ము కేన్సరుకు బలైపోతోందని అన్నారు. తొలిదశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులువవుతుందని, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా రొమ్ము కేన్సర్‌పై విజయం సాధించవచ్చని చెప్పారు.

వ్యాధిని జయించగలననే నమ్మకంతో పోరాడితే రొమ్ము కేన్సర్ వ్యాధిని సులువుగా అధిగమించవచ్చని ఉపేంద్రనాథ్ అన్నారు. అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ మెడికల్ డైరక్టర్ డాక్టర్ ఎన్.సుబ్బారావు మాట్లాడుతూ కేన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స తేలికవుతుందని, కానీ కేన్సర్ అని గుర్తించేసరికే 60 శాతం మందిలో ముదిరిపోయి ఉండటంతో పరిస్థితి చేయి దాటిపోతుందని అన్నారు.

సరైన అవగాహన లేకపోవడం, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం, ముందస్తు పరీక్షలు చేయించుకోకపోవడం వంటివన్నీ సమస్యను పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రొమ్ములో ఏదైనా గడ్డ కనబడుతున్నా, ఎక్కడైనా గట్టిగా అనిపిస్తున్నా, పరిమాణం, ఆకారం మారినట్లున్నా, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావం వస్తున్నా, చనుమొనల చుట్టూ ఎరుపు దద్దు లాంటిదేదైనా కనిపించినా, చనుమొన లోపలికి తిరిగిపోయినట్లున్నా, రొమ్ముమీద చర్మం మందంగా మారుతున్నా, ఎక్కడైనా గుంట పడుతున్నా, చంకల్లో గడ్డలు, నొప్పి ఉన్నా, మెడ ఎముక దగ్గర వాపు వచ్చినా అనుమానించాలన్నారు.

అయితే రొమ్ముల్లో వచ్చే గడ్డలన్నీ కేన్సర్లు కాకపోవచ్చునని, రొమ్ముల్లో ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా, గడ్డ తగిలినా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే అవసరాన్ని బట్టి మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, ఎమ్మారై స్కాన్ తదితర పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారని వివరించారు.

కేన్సర్ వ్యాధిని నిర్ధారించిన తర్వాత సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ విధానాల ద్వారా నివారించవచ్చని డాక్టర్ సుబ్బారావు తెలిపారు. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ట్రెజరర్ డాక్టర్ అక్కినేని మణి మాట్లాడుతూ ముప్పై ఏళ్ల వయసు దాటిన మహిళలు ప్రతి ఏటా క్లినికల్ పరీక్ష చేయించుకోవాలని, 40 ఏళ్ల వయసు దాటిన మహిళలు ఏటా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ ముప్పును ముందుగా గుర్తించవచ్చని అన్నారు.

కేన్సర్ అని తేలితే కుంగిపోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుత చికిత్సా విధానాల ద్వారా కేన్సర్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యమేనని స్పష్టం చేశారు. బ్రెస్ట్ కేన్సర్ సంబంధించి వాకథాన్ లో పాల్గొన్న వారు అడిగిన సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సెక్రటరీ బిక్కిన సావిత్రిదేవి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి.నాగేశ్వరరావు, అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ జోనల్ డైరక్టర్ ఎం.మహీందర్ రెడ్డి, అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments