Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.కోట్లకు కక్కుర్తి: భర్త సహకారం... మాటలు కలిపి.. మత్తులో ముంచిన వగలాడి

రూ.కోట్లకు కక్కుర్తి: భర్త సహకారం... మాటలు కలిపి.. మత్తులో ముంచిన వగలాడి
, ఆదివారం, 20 అక్టోబరు 2019 (12:12 IST)
వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు, ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఓ మతప్రచారకుడికి కుచ్చు టోపీ పెట్టేందుకు ఓ వగలాడిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఆమెకు కట్టుకున్న భర్తే పూర్తి సహాయ సహకారాలు అందించాడు. పైగా, మత ప్రచారకుడితో పార్కులు, షికార్లు, సినిమాలకు తిరిగేందుకు కూడా ఆ భర్త అనుమతించాడు. ఆ తర్వాత మత ప్రచారకుడు నుంచి రూ.కోటికి గాలం వేసి.. రూ.10 లక్షలు వసూలు చేశారు. డబ్బుల కోసం వగలాడి చేస్తున్న ఒత్తిడి, బెదిరింపులు తట్టుకోలేక మతప్రచారకుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళ (25) ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసేది. ఆమె భర్తకు నగరంలో ఏడు హోటళ్లు ఉండగా, అవి నష్టాలను చవిచూస్తూ వచ్చాయి. దీంతో హోటల్స్ వ్యాపారంలో దివాళా తీశారు. వీటి నుంచి గట్టెక్కేందుకు భార్యాభర్తలిద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు. 
 
తమ పథకంలో భాగంగా, మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లిన మహిళ అక్కడి మతప్రచారకుడితో మాటలు కలిపింది. సికింద్రాబాద్‌లో తాను చిన్నారుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అతన్ని నమ్మించి.. అతని ఫోన్ నంబరు తీసుకుంది. ఆ తర్వాత అతన్ని ముగ్గులోకి దించేందుకు చాటింగ్, మెసేజ్‌లు చేయసాగింది. అలా మతప్రచారకుడికి దగ్గరైంది. వారిద్దరి పరిచయం కాస్త సినిమాలు, షికార్లు, పార్కులకు వెళ్లింది. 
 
అలా వారి పరిచయం మరింత బలపడడంతో తన అసలు పథకానికి తెరతీసింది. హోటల్ వ్యాపారంలో ఉన్న తన భర్త విజయవాడలో వ్యాపారం ప్రారంభించనున్నాడని, పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఆమెను నమ్మిన బాధితుడు రూ.10 లక్షలు సమర్పించుకున్నాడు. చర్చల కోసం విజయవాడ నుంచి ప్రతినిధులు వస్తున్నారని గతనెలలో అతడితో చెప్పిన నిందితురాలు.. శంకర్‌పల్లిలోని ఓ రిసార్టుకు పిలిపించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న వ్యక్తులు అతడిని ఓ గదిలో వేచి చూడమని చెప్పారు. 
 
ఆ రాత్రి అకస్మాత్తుగా గదిలో ప్రత్యక్షమైన వగలాడి మహిళ నిద్రమాత్రలు కలిపిన డ్రింక్ ఇవ్వడంతో మతప్రచారకుడు సేవించాడు. అది తాగి అతడు మత్తులోకి జారుకున్న తర్వాత.. అతడితో సన్నిహితంగా ఉన్నట్టు ఫొటోలు, వీడియోలు తీసుకుంది. బాధితుడికి ఉదయం మెలకువ వచ్చేసరికి బాత్‌టబ్‌లో ఉండడంతో షాకయ్యాడు.
 
అదేసమయంలో అక్కడికి చేరుకున్న మహిళ భర్త.. మత ప్రచారకుడిని గదిలోకి తీసుకొచ్చి భార్యను, అతడిని కలిపి చితక్కొట్టాడు. ఇద్దరి మధ్య ఏం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుపాకి చూపించి చంపేస్తానని బెదిరించాడు. దీంతో తనను వదిలేయాలంటూ బాధితుడు కాళ్లావేళ్లా పడ్డాడు. చివరికి కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని అతడిని వదిలిపెట్టాడు. 
 
ఆ తర్వాతి రోజు డబ్బుల కోసం అతడికి ఫోన్ చేయడంతో రూ.10 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా డబ్బుల కోసం ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి పన్నాగం బయటపడింది. ఈ పథకం కోసం మహిళ భర్త నాంపల్లిలో బొమ్మ తుపాకి కొన్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.2,44,941.30 ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు