ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన విజయవాడలో తిరిగి పాస్‌పోర్టు సేవలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ఈ సేవలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, ఈ కేంద్రం నుంచి అందిస్తూ వచ్చిన పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్ వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అత్యవసర పనులపై విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు పాస్ పోర్టు సేవలను తిరిగి ప్రారంభించారు. అత్యసరమైన వారికి సేవలందించాలన్న లక్ష్యంతో రోజుకు 3 గంటల మేర సేవలందించాలని నిర్ణయించారు.
ఇదిలావుంటే, సాధారణ రోజుల్లో అధికారులు రోజుకు సగటున 250 వరకు పాస్‌పోర్టు దరఖాస్తులను పరిశీలిస్తుంటారు. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో.. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కార్యాలయం పనిచేస్తుంది. కొవిడ్ నిబంధనలను అనుసరించి ప్రతి రోజూ చాలా తక్కువ సంఖ్యలోనే స్లాట్స్ కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అత్యవసరమైతేనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.