దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా పేరొందిన వందే భారత్ రైళ్లు చిన్నపాటి ప్రమాదాలకే ఆగిపోతున్నాయి. ఆ మధ్య ఆవును ఢీకొనడం వల్ల రైలు ముందు డోమ్ దెబ్బతింది. తాజాగా కుక్కను ఢీకొనడంతో రైలు ఆగిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న వందే భారత్ రైలు... బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం సాయంత్రం కుక్కను ఢీకొంది. దీంతో ఆ రైలు 20 నిమిషాల పాటు ఆగిపోయింది.
ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది అందించిన సమాచారం మేరకు.. రైలు చీరాల స్టేషన్ వద్ద కుక్కను ఢీకొనడంతో ప్రెజర్‌బాక్స్‌ను బలంగా తాకింది. దీనికి సంబంధించిన నట్టు దెబ్బతింది. దీంతో రైలు కొంత ముందుకువెళ్లి రైల్వేగేటు దాటి నిలిచిపోయింది. అనంతరం చెన్నైలోని నిపుణుల సలహా మేరకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేయడంతో రైలు ముందుకు కదిలింది.
అలాగే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆదివారం పెనుప్రమాదం తప్పింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టాలపైకి అడ్డుగా వచ్చిన ఎద్దును రైలు ఢీకొట్టింది. దీంతో రైలు కొద్ది నిమిషాలపాటు నిలిచిపోయింది.
ఇంజిన్ ముందు భాగం (క్యాటిల్ గార్డ్) కొంత విరిగి సంఘటన స్థలంలో పడింది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన ఎద్దును తొలగించి రైలును పంపించారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.