తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. టిటిడి ప్రతిష్టను, గౌరవాన్ని దిగజార్చే విధంగా మాట్లాడిన వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై పరువు నష్టం దావా కొనసాగించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరుపతిలో ఒక పిటిషన్‌ను టిటిడి తరపున న్యాయవాది దాఖలు కూడా చేశారు.
2008 సంవత్సరంలో టిటిడి ప్రతిష్ట దిగజార్చే విధంగా విజయసాయిరెడ్డితో పాటు రమణదీక్షితులు వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో దీనిపై ఇద్దరి మీద 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు కాస్త నడుస్తూనే ఉంది. అయితే వైపిపి అధికారంలోకి రావడం.. సరిగ్గా నెల క్రితం వీరిపై ఉన్న పరువు నష్ట దావాను ఎత్తివేయడానికి మరో పిటిషన్‌ను నెల క్రితం తిరుపతిలోని కోర్టులో దాఖలు చేశారు.
అసలు ఈ మొత్తం కేసుకు సంబంధించి 2 కోట్ల రూపాయలను టిటిడి కోర్టుకు కూడా చెల్లించింది. కానీ ఇప్పుడు ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బిజెపితో పాటు ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో మళ్ళీ టిటిడి వెనక్కి తగ్గింది.
ఈరోజు మధ్యాహ్నం తిరుపతిలోని కోర్టు సముదాయాల్లో ఒక పిటిషన్‌ను టిటిడి తరపు న్యాయవాది దాఖలు చేశారు. అందులో రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలపై పరువు నష్ట దావాను కొనసాగించాలని కోర్టును కోరుతూ ఆ పిటిషన్ ఉంది. దీంతో ఈ కేసు ఆసక్తికరంగా మారబోతోంది. వారి నుంచి 200 కోట్ల రూపాయలను టిటిడి పరువు నష్టం కింద వసూలు చేస్తుందా.. లేకుంటే కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనది ఆసక్తికరంగా మారుతోంది.