విశాఖపట్టణంలో ఏపీ ప్రభుత్వం తలపెట్టిన అతిపెద్ద అతిథి గృహ నిర్మాణం ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. విశాఖపట్టణానికి రాజధాని తరలివెళ్లినా.. వెళ్లకపోయినా ఆ అతిథి గృహ నిర్మాణం ఖాయమని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు.
కాగా, విశాఖ నగరంలో సువిశాలమైన గెస్ట్ హౌస్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో పాటు అమరావతి రైతులు వేసిన పిటిషన్లను కూడా ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనను వినిపిస్తూ.... ఏపీ పాలనా రాజధాని విశాఖకు తరలి వెళ్లినా, వెళ్లకపోయినా అక్కడ గెస్ట్ హౌస్‌ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ శ్యామ్ దివాన్ వాదనలను వినిపిస్తున్నారు.
ఇదిలావుంటే, ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణను వచ్చే నెల 5వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు, హైపవర్ కమిటీకి చట్టబద్ధత వంటి అంశాలపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
అమరావతి రైతులు మొత్తం 93 పిటిషన్లను దాఖలు చేశారు. తమతో సీఆర్డీయే చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ తమ పిటిషన్లో రైతులు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను ఈరోజు ఆన్‌లైన్‌లో హైకోర్టు విచారించింది.
సాంకేతిక కారణాలతో విచారణను వాయిదా వేస్తున్నామని చెప్పింది. అక్టోబరు 5వ తేదీ నుంచి రెగ్యులర్‌గా విచారణ జరుపుతామని పేర్కొంది. పిటిషన్లలోని కొత్త అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.