ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సొంత పార్టీని వీడి అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నట్టు తెరాస నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ చేరిక కూడా ఖమ్మం, పాలేరు ఉప ఎన్నిక లోపే ఉంటుందని వారు ఘంటాపథంగా చెపుతున్నారు.
ఈ ప్రచారంపై సండ్ర వెంకట వీరయ్య సోమవారం రాత్రి స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టంచేశారు. తాను పార్టీ మారబోనని, అంత ఖర్మ నాకు పట్టలేదన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడిగా పని చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
మా మీద ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉన్నాకూడా లక్ష్యం కోసం పని చేస్తున్నామన్నారు. పాలేరు ఉపఎన్నిక సందర్భంగా టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొల్పేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు వాటన్నింటిని టీడీపీ నేతలు, కార్యకర్తలు తిప్పికొడతారని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన వైకాపా ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యేను తెరాస ఆకర్షించి, పార్టీలో చేర్చుకున్న విషయంతెల్సిందే.