ధార్మిక క్షేత్రం తిరుపతి అపవిత్ర, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతోంది. తిరుపతి పరువును కొంతమంది దిగజార్చేస్తున్నారు. ఇప్పటివరకు ఆలయాలకు సమీపంలో గుట్టుచప్పుడు సాగుతున్న సెక్స్ రాకెట్ ఇప్పుడు ఏకంగా రైల్వేస్టేషన్‌కు దగ్గరలోని పేరు గాంచిన లాడ్జీలలోనే గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. గత కొన్నినెలలుగా జరుగుతున్న ఈ తతంగాన్ని పోలీసులు బయటపెట్టారు.
తిరుపతికి చెందిన ఐదు మంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి నెల్లూరు జిల్లా నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌కు దగ్గర ఉన్న పేరుగాంచిన కొన్ని లాడ్జీలలో ఈ తతంగాన్ని జరిపుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం రావడంతో రంగంలోకి దిగి లాడ్జిలలో దాడులకు దిగారు. ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేయడమే కాకుండా కొంతమంది విటులను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు.
అయితే పట్టుబడిన ముఠా సభ్యుల్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ప్రసాద్ ఆచారి అనే వ్యక్తి ఈ ముఠాకు కీలక పాత్రను పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్ తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద మాత్రమే కాకుండా పట్టణంలోని మరికొన్ని ప్రాంతాల్లో సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.