తిరుపతికి చెందిన టెక్కీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆదివారం చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతికి చెందిన యువ ఔత్సాహిక వాతావరణవేత్త సాయిప్రణీత్ని అభినందించారు.
సాయి ప్రణీత్ గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని విశేషంగా ప్రస్తావించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన ఈ యువకుడు... వాతావరణంలో వచ్చిన విపరీతమైన మార్పుల కారణంగా తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోవడం చూసి ఆవేదనకు లోనయ్యారు.
వాతావరణ శాస్త్రం పట్ల ఎప్పటినుంచో ఆసక్తి ఉన్న సాయి ప్రణీత్ దాన్ని రైతుల ప్రయోజనాలకోసం ఉపయోగించాలని భావించి ఒక సరికొత్త పంథాలో నడిచారు. వాతావరణ డేటాను సేకరించి, విశ్లేషించి విభిన్న మీడియా వేదికల ద్వారా రైతులకు స్థానిక భాషలో వాతావరణ సమాచారం అందించడం మొదలుపెట్టారు.
ఒకవైపు ఎప్పటికప్పుడు ఈ సమాచారం చెబుతూనే విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఏం చేయాలన్నదానిపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వరదలను ఎలా అధిగమించాలి, పిడుగుల నుంచి ఎలా తప్పించుకోవాలి? అన్న విషయాలను కూడా చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ ఆ టెక్కీ పేరును ప్రధానంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారు.