2019 ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తానంటే : పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో తన మద్దతుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. అనంతపురం రైతాంగం కన్నీరుని ఎవరు తుడుస్తారో వారికి తాను అండగా ఉంటానని చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో తన మద్దతుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. అనంతపురం రైతాంగం కన్నీరుని ఎవరు తుడుస్తారో వారికి తాను అండగా ఉంటానని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మూడు రోజుల ప్రజా యాత్రను ముగించుకున్న పవన్ శనివారం నుంచి ఏపీలోని అనంతపురం జిల్లాలో తన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రైతులతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు.
తాను రాబోయే ఎన్నికల్లో ఎవరికి మద్దతు పలుకుతానన్న ప్రశ్న అందిరిలోనూ ఉందని, ఎవరైతే రైతులకు అండగా ఉంటారో వారికి తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు.
ఏ పార్టీకైనా మద్దతిచ్చే ముందు అనంతపురానికి అండగా ఎలా నిలబడతారని అడుగుతానని తెలిపారు. రైతులకి జనసేన పార్టీ అండగా ఉంటుందని, అనంతపురం నుంచి తనకు మద్దతు కావాలన్నారు. ఎన్నికల ముందు రాజకీయ నాయకులు వచ్చి ఓటేయమని అడుగుతారని, అనంతపురానికి ఏం చేశారని నిలదీయాలని పిలుపునిచ్చారు.
అలాగే అనంతపురం ప్రజలు ఇష్టమైతేనే జనసేన పార్టీకి ఓటు వేయాలని, లేదంటే తనను ఓడించాలని అన్నారు. 2019 ఎన్నికల్లో అనంతపురం నడుంబిగించకపోతే ఎప్పటికీ ఈ ప్రాంతం సమస్యలు పోవని అన్నారు.
రాష్ట్రంలోనే అత్యధిక కరువు మండలాలు ఉన్న జిల్లా అనంతపురమని అన్నారు. కరవు సమస్యలంటూ ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడుతున్నాయని, ఇందు కోసం అన్ని విభాగాలు ఉన్నాయని, కానీ అవి సమర్థవంతంగా పనిచేయడం లేదని ఆరోపించారు.
గెలుపు ఓటములు తనకు కొత్త కావని పవన్ కల్యాణ్ అన్నారు. రైతు రాజు కావాలని, బానిస కాకూడదని, రైతుల తరఫున తాను పోరాడతానని అన్నారు. ఇక ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని, కానీ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తానని పవన్ స్పష్టం చేశారు.