చంద్రగిరి అసెంబ్లీ నియోజవర్గంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అనుమానితులుగా భావిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుపతికి తరలించి రహస్యంగా విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జడ్పీటీసీ సభ్యురాలి భర్త భానుప్రకాష్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి తర్వాత వీరంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
కాగా, నానిపై దాడిలో సుమారు 15 మంది పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితులను గంటలో అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ మంగళవారం ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు వారిని అదుపులోకి తీసుకోకపోవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసుల వైఖరిని నిరసిస్తూ పులివర్తి నాని భార్య సుధ ఆందోళనకు దిగారు. 24 గంటలు గడుస్తున్నా నిందితులను పట్టుకోలేదంటూ తిరుచానూరు పీఎస్ వద్ద ఆమె నిరసన చేపట్టారు.
కోలీవుడ్‌లో విడిపోయిన మరో ప్రేమ జంట... జీవీ ప్రకాష్ - సైంధవి విడాకులు
కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మరో ప్రేమ జంట విడిపోయింది. ప్రముఖ సంగీత దర్శకుడిగా, హీరోగా రాణిస్తున్న జీవీ ప్రకాష్, గాయని సైంధవిలు విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్టు జీవీ ప్రకాష్ సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. దీంతో వారిద్దరి 11 ఏళ్ల వైవాహిక బంధానికి త్వరలో కోర్టు ద్వారా తెరపడనుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వారు పోస్టు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడైన జీవీ ప్రకాశ్.. 2013లో తన బాల్య మిత్రురాలు సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో వారికి కూతురు పుట్టింది.
తమ విడాకులపై జీవీ ప్రకాష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్‌లో 'చాలా ఆలోచించిన తర్వాత 'సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగు కోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం' అని జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు.