ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంలోకి ఎమ్మెల్యేలే కాదు... ఇతర నాయకులు కూడా వలసపోతున్నారు. కనిగిరి మాజీ శాసన సభ్యులు, డిసిసి అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై రెండు మూడు రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
ఈయన రాకను స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు జీర్ణించుకోలేకపోతున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు గండంగా మారతారని భయపడుతున్నారు.ఉగ్ర నరసింహారెడ్డిని టిడిపిలో రానీయకుండా అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు హైదరాబాదుకు వెళ్లేందుకు పయనమయ్యారు. మళ్లీ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. నియోజకవర్గం లో మకాం వేసి, ఉగ్రకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించేందుకు టిడిపి దిగువ స్థాయి క్యాడర్‌ను రంగంలోకి దించారు.
ఉగ్ర నరసింహారెడ్డికి వ్యతిరేకంగా జిల్లా స్థాయి నేతలతోనూ మంతాలు సాగించారు. టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యునితో చర్చిస్తే ‘నాకే దిక్కులేకపోతే నీకేం చేసేది’ అని ఆయన నిట్టూర్చినట్లు తెలిసింది.
మరో ప్రయత్నంగా తన బాల్య మిత్రుడు నందమూరి బాలకృష్ణ వద్ద కూడా మొరపెట్టుకున్నారని తెలిసింది. అక్కడా ప్రయోజనం దక్కలేదు. చివరిగా జిల్లాలో పార్టీకి కీలకమైన ఒక సామాజిక గ్రూపుతో పురమాయించారనీ, పార్టీ జిల్లా అధ్యక్షుడి వద్దకు రాయభారం పంపుతున్నారనీ కొత్త ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ వలసల కాలంలో ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలోకి రాక తథ్యమని తెలుస్తోంది.