Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్ పాలనకు కుప్పం ప్రజల‌ మద్దతు! ఎన్టీయార్ కి ఇచ్చేయ్!

సీఎం జగన్ పాలనకు కుప్పం ప్రజల‌ మద్దతు! ఎన్టీయార్ కి ఇచ్చేయ్!
విజ‌య‌వాడ‌ , బుధవారం, 17 నవంబరు 2021 (17:18 IST)
సీఎం వైయస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి ప్రజలు పట్టం కట్టారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, భూగర్భ గనులు, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలోని  పబ్లిసిటీ సెల్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం అనే వివక్షత లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాల ఫలితమే ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సిపి విజయమని అన్నారు. 
 
 
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లీనిక్స్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం వైయస్ జగన్ చేస్తున్న కృషికి ప్రజలు మద్దతు పలుకుతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, పరిషత్, మున్సిపోల్స్‌లో వరుసగా వైయస్‌ఆర్‌సిపి ఘన విజయాలను సాధించిందని, కుప్పం ప్రజలు ఛీ కొట్టిన తరువాత ఇంకా కుప్పం గురించి చంద్రబాబు మాట్లాడతాడని తాము భావించడం లేదని అన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవడానికి టిడిపి అనేక దౌర్జన్యాలకు పాల్పడిందని గుర్తు చేశారు. చివరికి చంద్రబాబు హైకోర్ట్‌కు వెళ్ళి ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించుకునేలా ఉత్తర్వలు తెచ్చుకున్నారని అన్నారు. ప్రజలు వైయస్‌ఆర్‌సిపికి అండగా ఉంటే, డబ్బు పంపిణీ చేశామంటూ మాపైన తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్న తమకు డబ్బు పంపిణీ చేయాల్సి అవసరం లేదని అన్నారు. 
 
ఆనాడు కాంగ్రెస్‌లో ఉండి ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ, చంద్రబాబు ప్రగల్భాలు పలికాడని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తరువాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కుని, చివరికి ఆయనను పదవి నుంచి దింపేసి, ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమయ్యాడని విమర్శించారు. నేడు తెలుగుదేశం పార్టీని తన అసమర్థతతో నిర్వీర్యం చేస్తున్నాడని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పార్టీ నాయకత్వం నుంచి తప్పుకుని, ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు పార్టీని అప్పగిస్తే మంచిదని హితవు పలికారు. 
 
 
72 సంవత్సరాల వయస్సుతో ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు తన ఓటున్న నియోజకవర్గం నుంచి కూడా కుమారుడు లోకేష్ గెలవలేదనే బాధతో ఉన్న చంద్రబాబు, హైదరాబాద్ లో ఉండి తన ఆరోగ్యంను కాపాడుకోవడం మంచిదని సూచించారు. సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఇంకా రాజకీయాల్లోనే ఉంటానంటే అది ఆయన ఇష్టమని అన్నారు. కుప్పం ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, లోకేష్, టిడిపి నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారని, లోకేష్ తన స్థాయిని మించి మాట్లాడారని మండిపడ్డారు. లోకేష్ ఇలాగే మాట్లాడితే ఇకపై సహించేది లేదని, తగిన విధంగా స్పందన ఉంటుందని హెచ్చరించారు. లోకేష్ మాట్లాడిన మాటలకు కుప్పం ప్రజలు రెండు చెంపలు వాయించి, ఇకపై మా ఊరికి రావద్దని తీర్పు చెప్పారని అన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో పోటీ చేస్తాడని అనుకోవడం లేదని మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒకవేళ పుంగనూరు నుంచి పోటీ చేయడానికి చంద్రాబు ఉత్సాహం చూపితే అందుకు స్వాగతిస్తానని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్ హోటళ్ళలో కూర్చొని రైతులపై సెటైర్లు వేస్తారా? సుప్రీంకోర్టు ఫైర్