ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడితే కాపాడాల్సిన ఓ ఖాకీ తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓ మహిళపై కన్నేశాడు. రూమ్ కి రా... ఎంజాయ్ చేద్దామంటూ వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా మెసేజ్‌లు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎంతో సహనంతో ఉన్న ఆ మహిళ.... అతడు విధులు నిర్వహిస్తున్న పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
వివరాలలోకి వెళితే.., ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సోమశేఖర్ స్థానిక పోలిస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు పనిచేస్తూ.. గంగవరం మండలం సాయినగర్లో నివాసం ఉంటున్నాడు. తాను నివాసం ఉంటున్న ఇంటి మిద్దెపైనే కుటుంబ సభ్యులతో కలసి ఓ వివాహిత ఉంటోంది. పొరుగింటివారి పట్ల గౌరవంగా ఉండాల్సిన వాడు ఆమెపై కన్నేశాడు.
తరచూ ఫోన్లు, మెసేజీలతో వేధించడమే కాకుండా.., నేరుగా కూడా నువ్వంటే ఇష్టం.., నా దగ్గరకురా.. అంటూ వేధించసాగాడు. అక్కడితో ఆగకుండా అసభ్యకర మెసేజులు వీడియోలను పంపుతున్నాడు. లైంగికంగా కావాలని బెదిరించేవాడు. తన ప్రవర్తనతో విసుగు చెందిన ఆ వివాహిత తన భర్తకు, పోలీసులకు పిర్యాదు చేస్తానని చెప్పింది. దీంతో సోమశేఖర్ నీ దిక్కున్నచోట చెప్పుకోవాలని.., నన్ను ఏమి చేయలేరు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.
సోమశేఖర్ తీరుతో విసిగిపోయిన ఆ మహిళ భర్త సహకారంతో పలమనేరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. తనను తరచు కానిస్టేబుల్ సోమశేఖర్ వేధింపులకు గురి చేస్తున్నాడని స్థానిక ఎస్సైతో మొరపెట్టుకుంది. అయితే ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.