తన కేబినెట్‌లోని 8మంది మంత్రులతో పాటు వైసీపీ ఎంపీలపై ఐటీ దాడులు జరగకుండా ఉండేందుకే జగన్ దిల్లీ పర్యటకు వెళ్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడుతూ… ఐటీ దాడుల నుంచి తమవారిని రక్షించుకునేందుకే సీఎం దిల్లీ పర్యటన అని విమర్శించారు.
చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ.2లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే ఐటీ అధికారులు గుర్తించారని చెప్పారు. దొంగే.. దొంగా అన్నట్లు వైకాపా నేతల వ్యవహారశైలి ఉందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదని.. ఆర్థిక అత్యయిక పరిస్థితి రాబోతోందని ఉమ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల రేషన్‌కార్డులు, 7లక్షల పింఛన్లు తొలగించి ఇప్పుడు రీవెరిఫికేషన్ డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.