Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుంచి ఇంటర్ మొద‌టి సంవ‌త్స‌రం తరగతులు ప్రారంభం: మంత్రి ఆదిమూలపు సురేష్

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (20:00 IST)
కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది ఆఫ్‌ లైన్‌లోనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి మొదటి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్‌లో అడ్మిషన్లు నిర్వహించనున్న‌ట్లు తెలిపారు. త్వ‌రలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 11 తేదీన జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్న‌ట్లు మంత్రి తెలిపారు.

సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఆఫ్ లైన్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు.

ఈ నెల 7వ తేదీ నుంచే అడ్మిషన్ దరఖాస్తులు విక్రయాలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ నెల 17వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు ఆఖరి గడువని, అదే రోజు అడ్మిషన్లు కూడా పూర్తవుతాయని మంత్రి తెలిపారు. ఆ మరుసటి రోజు అనగా ఈ నెల 18వ తేదీ నుంచి  ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు. 
 
త్వరలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్...
2020-21 విద్యా సంవత్సరం ఈ ఏడాది మే వరకూ కొనసాగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సీబీఎస్ఈ షెడ్యూల్ ప్రకారం కాంపీటీటివ్ పరీక్షలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు నిర్వహించే అవకాశముందని, ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.

కరోనా కారణంగా సిలబస్ లో 30 శాతం మేర తగ్గించామన్నారు. ఇందుకు సంబంధించి సబ్జెక్టుల వారీగా సిలబస్ వివరాలను ఆయా కళాశాలకు అందజేశామన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఉండకపోవొచ్చునంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
 
అధిక ఫీజులు వసూలు చేస్తే గుర్తింపు రద్దు ...
కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఈ ఏడాది ఆఫ్ లైన్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అడ్మిషన్ల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా నిబంధనలకనుగుణంగా ఫీజులు వసూలు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే విడుదల చేశామన్నారు.

గతేడాది వసూలు చేసిన ఫీజులులో 30 శాతం రాయితీ ఇచ్చి, 70 శాతం మేర ఫీజులు వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసినా, కరోనా గైడ్ లైన్స్ ను పాటించకున్నా కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆయా కళాశాలల గుర్తింపులు సైతం రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. కరోనా గైడ్ లైన్స్ ను, అధిక ఫీజులు వసూలు చేసే కళాశాలల అక్రమాలను తమ దృష్టికి తీసుకురావాలనుకునే వారు 9391282578 వాట్సాప్ నెంబర్‌కు గాని, ourbieap@gmail.com మెయిల్ గాని సమాచారమందిస్తే సంబంధిత కళాశాలలపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నెల 5వ తేదీన విజయవాడ(గొల్లపూడి)కి చెందిన నారాయణ విద్యా సంస్థలో ఆకస్మిక తనిఖీలు చేసి పలు లోపాల‌ను గుర్తించామన్నారు. అధికారుల నుంచి వచ్చే రిపోర్టుల ఆధారంగా ఆ కళాశాలపై చర్యలు తీసుకుంటామని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్న‌ట్లు  మంత్రి వెల్లడించారు. 
 
సర్టిఫికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు ...
కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులు పెంచడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఫీజులు వసూలు చేయనున్నామన్నారు. గతంలో ఏటా 30 శాతం మేర పరీక్ష ఫీజులు పెంచేవారన్నారు. కరోనా దృష్ట్యా ఇంటర్మీడియట్ బోర్డుకు ఆర్థిక ఇబ్బందులున్నా ఫీజులు పెంచడంలేదన్నారు. గతేడాది మాదిరిగానే మొదటి సంవత్సరం పరీక్షకు రూ.500లు, రెండో సంవత్సరానికి రూ.680లు చెల్లిస్తే సరిపోతుందన్నారు.

అడ్మిషన్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ను ఇప్పటికే అన్ని కళాశాలకు పంపించామన్నారు. అడ్మిషన్ల సమయంలో టెన్త్ క్లాస్, ఇతర సర్టిఫికెట్లను పరిశీలించి, తిరిగి విద్యార్థులకు ఇచ్చివేయాలన్నారు. అలాకాకుంటే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీని కోరామన్నారు. 
 
ఈ నెల 11న జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపులు ...
ఈ నెల 11వ తేదీన జగనన్న అమ్మ ఒడి రెండో విడత చెల్లింపులు చేపట్టనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. నెల్లూరులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా జగనన్న అమ్మఒడి చెల్లింపులు జమ చేయనున్నామన్నారు. ఇప్పటికే పారదర్శకంగా ఎంపిక చేసిన అర్హుల జాబితాను పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టామన్నారు.

గతేడాది కంటే ఈ ఏడాది ఇంకా ఎక్కువ మంది లబ్ధిదారులకు జగనన్న అమ్మఒడి పథకం కింద ఎంపిక చేశామన్నారు. రెండో విడత జగనన్న అమ్మఒడి రెండో విడత చెల్లింపుల కార్యక్రమం నిర్వహణకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామన్నారు.

జిల్లా స్థాయిలో మంత్రులు, నియోజక వర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమాల నిర్వహణ సమయంలో కొవిడ్-19 నిబంధనలు పాటించేలా గైడ్‌లైన్స్ రూపొందించామని, వాటిని పాటించేలా అధికారులకు ఉత్తర్వుల జారీ చేసిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments