Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా పాఠాలతో ఆన్‌లైన్ తరగతులు తప్పడం లేదు: ఉపరాష్ట్రపతి

కరోనా పాఠాలతో ఆన్‌లైన్ తరగతులు తప్పడం లేదు: ఉపరాష్ట్రపతి
, శనివారం, 28 నవంబరు 2020 (07:12 IST)
దేశవ్యాప్తంగా డిజిటల్ సాక్షరతను ప్రోత్సహించేందుకు ప్రజాఉద్యమం జరగాల్సిన ఆవశ్యకత ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ఉద్యమాన్ని విద్యాసంస్థలు, సాంకేతిక సంస్థలు ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు.

బోధన, అభ్యసన పద్ధతిలో మార్పు తీసుకురావడంలో సాంకేతికత సరికొత్త అవకాశాలను కల్పిస్తుందన్న ఆయన, ఇందుకోసం నూతన పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యావిధానాలను, బోధనాపద్ధతులను ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ‘ఆదిశంకర డిజిటల్ అకాడెమీ’ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, తరగతి గదుల్లో నేరుగా విద్యాభ్యాసంతోపాటు ఆన్‌లైన్ తరగతులను సమ్మిళితం చేసిన విద్యావిధానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బట్టీకొట్టి చదివే పద్ధతిని పక్కనపెట్టి.. విద్యార్థుల్లో లోతైన విశ్లేషణ, భావనాత్మకత, సృజనాత్మకతను పెంచే విద్యావిధానంపై మరింత దృష్టిపెట్టడం తక్షణావసరమని తెలిపారు.

కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన మార్పులతో కోట్లాది మంది విద్యార్థులు తరగతి గదులకు దూరమయ్యారన్న ఉపరాష్ట్రపతి... ఈ మార్పుతో ప్రపంచమంతా ఆన్‌లైన్ విద్యావిధానానికి మొగ్గుచూపాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు.

ఆన్‌లైన్ విద్యావిధానం ద్వారా మారుమూల ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యను అందుబాటు ధరల్లోనే అందించేందుకు వీలవుతుందని.. దీంతోపాటుగా, పనిచేసుకునేవారు, గృహిణులు రెగ్యులర్ కోర్సులను నేర్చుకునేందుకు సులభం అవుతుందన్నారు.

అందుకే కరోనానుంచి కోలుకున్న తర్వాత కూడా ఈ విధానాన్ని కొనసాగించేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారన్నారని, కరోనా కారణంగా మన విద్యావ్యవస్థలోనూ మార్పు వచ్చిందనడంలో సందేహం లేదని తెలిపారు.

కరోనాకు ముందే విద్యలో సాంకేతికత వినియోగించుకునే పద్ధతి ఊపందుకుందన్న ఉపరాష్ట్రపతి, ప్రపంచ ఎడ్యుటెక్ రంగంలో వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు.

దీని ద్వారా అభ్యాసకులతోపాటు విద్యాసంస్థల వ్యవస్థాపకులకు కూడా విస్తృతమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సృజనాత్మకతకు పదును పెట్టి ముందుకెళ్లాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

ఆన్‌లైన్ విద్యావిధానం ద్వారా ఏమేం అందించవచ్చు, ఏమేం అందించలేమనే దానిపై విశ్లేషణ చేసుకుని ముందుకెళ్లాలని సూచించిన ఉపరాష్ట్రపతి, ‘ఆన్‌లైన్ విధానం ద్వారా చాట్ గ్రూప్‌లు, వీడియో సమావేశాలు, పరస్పర సమాచార మార్పిడి, నిరంతర అనుసంధానత వంటి అవకాశాలుంటాయి. కానీ తరగతి గదిలో గురువుతో ప్రత్యక్షంగా ఉండి నేర్చుకునే విధానానికి ఇది పూర్తి ప్రత్యామ్నాయం కాదు’ అని పేర్కొన్నారు.

తరగతి గదుల్లో విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో తోటివారితో కలిసి మెలసి మెలగాల్సిన పద్ధతి, విలువలు, నైతికతతోపాటు క్రమశిక్షణ అలవడుతుందన్న ఉపరాష్ట్రపతి,  శారీరక దారుఢ్యం, క్రీడలు, యోగా వంటి వాటి ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని.. ఆన్‌లైన్ విద్యావిధానం ద్వారా అది సాధ్యపడదని పేర్కొన్నారు.

ప్రాచీన గురుకుల విద్యావ్యవస్థలో గురు, శిష్యుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండేదని.. సమర్థుడైన గురువుద్వారా విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతోపాటు విలువలు, నైతికతతో కూడిన సమగ్రమైన విద్య అందేదని తెలిపారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న సాంకేతిక అంతరాలను తొలగించి.. అందరికీ సాంకేతికత, సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, విధానపరమైన నిర్ణయాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించిన ఉపరాష్ట్రపతి, నూతన జాతీయ విద్యావిధానంలోనూ విద్యతోపాటు సాంకేతికతతోపాటు విలువలతో కూడిన విద్యనందించేలా సంస్కరణలు తీసుకురావడం అభినందనీయమన్నారు.

మరోసారి ప్రపంచ విద్యాకేంద్రంగా భారతదేశం భాసిల్లేందుకు డిజిటల్ విద్యావిధానం, నూతన జాతీయ విద్యావిధానం కీలకంగా మారతాయనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. రేపటి భారతదేశ భవిష్యత్తును ఉజ్వలం చేసే దిశగా ఆదిశంకర విద్యాసంస్థలు, ఆదిశంకర డిజిటల్ అకాడెమీ (ఏఎస్‌డీఏ) చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆదిశంకర ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, కే ఆనంద్, శృంగేరి మఠం సీఈవో సీఆర్ గౌరీశంకర్, ఈ-డ్రోనా లెర్నింగ్ డైరెక్టర్ చిత్రాతోపాటు అధ్యాపకులు, విద్యార్థులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్టీ సమావేశాలకు, కేబినెట్ సమావేశాలకు తేడా లేకుండా చేస్తున్నారు: బొండా ఉమా