రాష్ట్ర రాజధానిపై ఒక వైపు వైసిపి మంత్రులు, మరో వైపు బి జె పి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అమరావతి రైతులు ఆందోళనలో ఉన్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ పెదవి విప్పాలని డిమాండ్ చేశారు టిడిపి నేత ప్రత్తిపాటి పుల్లారావు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజధాని రైతులు ఆందోళనలో ఉన్నారని అన్నారు. రాజధానిపై తలెత్తిన గందరగోళాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులు ఆవేదనతో ఆత్మహత్యలకు పాల్పడకముందే ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు.
తలా ఓ రకంగా మంత్రులు చేస్తున్న ప్రకటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఈ గందరగోళం ఇలాగే కొనసాగితే వాళ్లు ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉందని ప్రత్తిపాటి హెచ్చరించారు. అలాగే అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ నాలుగు రాజధానులంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారని, దానిపైన కూడా ప్రభుత్వం స్పందించాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు. కాగా, రాజధాని అమరావతిపై తెర వెనుక లాలూచీ ఏంటో జగన్ బయటపెట్టాలి అని టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.
విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వరద నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం అమరావతి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. అమరావతిపై మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా జగన్ ఎందుకు స్పందించడంలేదని అనురాధ ప్రశ్నించారు. తక్షణమే రాజధానిపై జగన్ ప్రకటన చేయాలని అన్నారు.
విజయవాడ-గుంటూరు ప్రాంతాల మధ్య రాజధానికే ఎక్కువమంది మొగ్గు చూపిన విషయం శివరామకృష్ణన్ కమిటీలో ఉందన్న సంగతి బొత్స గ్రహించాలని ఆమె హితవు పలికారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇప్పుడు రోడ్లపై తిప్పుతున్నారని మండిపడ్డారు.