వైయస్‌ఆర్ పెన్షన్ కానుక కింద లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూలై నెల పెన్షన్ మొత్తాలను ఆగస్ట్ 1వ తేదీన నేరుగా 60,55,377 మంది లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ప్రతినెలా మొదటి తేదీన పెన్షనర్లకు పింఛన్ మొత్తాలను అందించాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని అన్నారు. ఆదివారం (ఆగస్టు 1వ తేదీన) తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1455.87 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందని అన్నారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు ఇప్పటికే పంపిణీ చేసారని, సచివాలయాల ద్వారా వలంటీర్లు పెన్షనర్లకు వారి ఇంటి వద్ద, నేరుగా పెన్షనర్ల చేతికే పెన్షన్ మొత్తాలను అందచేస్తారని తెలిపారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్దంగా వున్నట్లు వెల్లడించారు.
లబ్ధిదారుల గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామని, అలాగే ఆర్‌బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్ ను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. మొత్తం మూడు రోజుల్లో నూరుశాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.