ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు రెండు అలంకారాలలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం అన్నపూర్ణ దేవిగా, మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనం లభించనుంది.
ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైన అలంకారం. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు(మంగళవారం) ఇంద్రకీలాద్రికి రానున్నారు. సీఎం జగన్ రాకకై చేస్తున్న ఏర్పాట్లను ఈఓ, వీఎంసీ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలిస్తున్నారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. భక్తుల కోరికపై ఓం టర్నింగ్ వద్ద కూడా ఒక టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.