ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం సకల మంత్రాలకు మూలమైన గాయత్రిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారు వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపంగా దర్శనమిస్తున్నారు.
భక్తులు గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మ సాక్షి సూర్యభగవానుడు గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవతగా భాసిల్లుతున్నాడు.
గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగుతాయనీ, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం.
ఈ రోజున వంగ, ఆకుపచ్చ, బంగారు వన్నెల చీరల్లో కొలువుదీరిన అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తున్నారు.