ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఓటు వేయొద్దని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పిలుపునిచ్చారు. వైకాపా పునాదులు తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి రక్తంతో తడిసివున్నాయన్నారు. గతంలో జగన్‌ను గడ్డిగా నమ్మానని, ఎవరినైనా పదేపదే మోసం చేయలేరని వ్యాఖ్యానించారు.
ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, 'నేను, వైఎస్ షర్మిల ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నామంటున్నారు. నాన్న హత్య జరిగాక నాతో మీరు తోలుబొమ్మలాట ఆడుకున్నారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చింది. ప్రజలు అంతా గ్రహిస్తున్నారు.. వాస్తవాలేంటో వారికి తెలుసు. ప్రతిసారి అందరినీ మోసం చేయలేరని గుర్తుపెట్టుకోవాలి' అని సునీత అన్నారు. అన్నగా తనకు సమాధానం చెప్పలేకపోయినా ఫర్వాలేదు.. సీఎంగానైనా చెప్పాలని జగన్‌ను డిమాండ్ చేశారు.
వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని సునీత అన్నారు. అలాంటి పార్టీ నుంచి అందరూ బయటకు రావాలని... లేకపోతే పాపం చుట్టుకుంటుందని చెప్పారు. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దని, ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని అన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలని చెప్పారు. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దామని... వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని అన్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ... ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఈరోజు విచారణ జరగనుంది. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.