తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరం దాటిన మాండస్ తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారనష్టాన్ని మిగిల్చింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలు ఈ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల దెబ్బకు అతలాకుతలమయ్యాయి. ఈదురు గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి.
రహదారులపైకి నీళ్లు చేరడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. అనేక ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పలు జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీకాళహస్తి - తడ మార్గంలో సున్నపు కాలువపై ఒక బస్సు చిక్కుకునిపోయింది. ఇందులోని ప్రయాణికులను సురక్షితంగ రక్షించారు. రేణిగుంట విమానాశ్రానికి రావాల్సిన పలు విమానాలను రద్దు చేశారు.
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఏకంగా 281 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా తీరంలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మాండస్ తుఫాను శనివారం సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో నేడు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.