అమరావతి : కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. అనాథలైన పిల్లలను చేరదీసి బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి, రక్షణ కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరక్టర్ కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. తల్లిదండ్రులు లేక ఏ ఆదరణ లేని చిన్నారుల కోసం జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కృతికా శుక్లా చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా మొత్తం 31 కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. జిల్లాలవారీగా వాటి వివరాలను వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బాలురు, బాలికల కోసం విడివిడిగా శాంతాకల్యాణ అనురాగ నిలయంలో వసతి ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో బాలురు కోసం బ్రైట్ ఫ్యూచర్ రెయిన్ బో చిల్డ్రన్ హోం, బొబ్బిలి మండలం కారాడలో బాలికల కోసం సన్ రైజ్ చిల్డ్రన్ హోం, విశాఖజిల్లా భీమునిపట్టణం మండలం నేరెళ్లవలసలో బాలికల కోసం ఎస్‌ఓఎస్ చిల్డ్రన్ విలేజ్ ఆఫ్ ఇండియా, బాలుర కోసం మధురవాడ దగ్గర పోర్టు కాలనీలోని అరుణోదయ-2 చిల్డ్రన్ హోం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్‌లోని బాలికల కోసం మిషన్ ఆఫ్ గ్రేస్, బాలుర కోసం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ సమీపంలోని ఏకలవ్య చిల్డ్రన్ హోం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బాలురు, బాలికల కోసం బేతెస్థ చిల్డ్రన్ హోం, పెంటపాడు మండలంలో రేచర్లలో బాలురు కోసం ప్రత్యేకంగా స్వాభిమాన్ చిల్డ్రన్ హోం, అలాగే బాలురు కోసం కొవ్వూరులోని మదర్ థెరిస్సా షెల్టర్ హోంను వసతి కోసం సిద్ధం చేశామని డాక్టర్ కృతిక శుక్లా తెలిపారు.
కృష్ణా జిల్లాలోని తోటపల్లిలో బాలురు కోసం హీల్ ప్యారడైజ్ చిల్డ్రన్ హోం, మచిలీపట్నంలో బాలురు, బాలికల కోసం బెరక చిల్డ్రన్ హోం, విజయవాడలో బాలురు కోసం మ్యాంగో చిల్డ్రన్ హోం, గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో బాలికల కోసం కార్డ్స్, గుంటూరులో బాలురు కోసం వెంకటేశ్వర మహిళా మండలి, తాడేపల్లిలో బాలురు, బాలికల కోసం చిగురు, ఇదే జిల్లా మాచర్లలో బాలురు కోసం స్వామి వివివేకానంద స్టూడెంట్స్ హోం సంరక్షణ కేంద్రాలుగా వుంటాయని కృతికా శుక్లా చెప్పారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని కె పల్లెపాలెంలో బాలురు కోసం ప్రేమానంద అనాథాశ్రమం, ఒంగోలులోని పోతురాజుకట్టలో బాలికల కోసం ఫరెవర్ ఫౌండ్ ఇండియా చిల్డ్రన్ హోం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని లెప్రస్ కాలనీలో బాలురు, బాలికల కోసం మేరియా రాఫోల్స్ హోం, చిత్తూరు జిల్లా తిరుచానూరులో బాలికల కోసం నవజీవన్ బ్లైండ్ పూర్ హోం, బైరాగిపట్టెడలో బాలురు కోసం మాతృశ్య చిల్డ్రన్ హోం, బాలురు, బాలికల కోసం ఏర్పేడులోని ఎస్‌ఓఎస్, చిత్తూరు నగరంలోని తీనబండలో బాలురు కోసం మేరీ చిల్డ్రన్ హోం ఉన్నాయన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలోని అక్కయ్యపల్లిలో బాలికల కోసం రీజనల్ చిల్డ్రన్ హోం, కడపలోని చిన్నచౌక్‌లో బాలురు కోసం మా అమ్మఒడి చిల్డ్రన్ హోం, కర్నూలు జిల్లా కేంద్రం సంతోషనగర్‌లో బాలురు కోసం కీర్తన అనాథ శరణాలయం, కర్నూలులోని పెదపాడులో బాలికల కోసం గవర్నమెంట్ చిల్డన్ హోం, అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలో బాలురు, బాలికలు కోసం ఆర్‌డీటీ చిల్డ్రన్ హోం తాత్కాలిక సంరక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేశామన్నారు. వీటికి ప్రత్యేకంగా ప్రొబేషన్/నోడల్ ఆఫీసర్లను నియమించినట్టు కృతికా శుక్లా చెప్పారు.
కొవిడ్ వల్ల అనాథలైన పిల్లల వివరాలు తెలిపేందుకు ఇప్పటికే 24 గంటలూ పనిచేసే టోల్ ఫ్రీ నెంబర్లు 181, 1098(చైల్డ్ లైన్)ను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించిన కృతికా శుక్లా, ఈ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి తల్లిదండ్రులు లేక ఒంటరైన బాల, బాలికల సమాచారాన్ని ఎవరైనా అందించవచ్చని అన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం అనాథలైన చిన్నారుల సంరక్షణతో పాటు, తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వుంటే వారి పిల్లల ఆలనాపాలనా కూడా ఈ కేంద్రాలలోనే తాత్కాలికంగా చూడనున్నట్టు కృతికా శుక్లా తెలిపారు.