తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం తన ఛాంబర్లో అదనపు ఈఓ ఏ వి ధర్మారెడ్డి, జెఈఓ పి.బసంత్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్త, సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి లతో సమావేశమయ్యారు. తిరుమలో పని చేసే ఉద్యోగుల నుంచి రోజుకు 100 కరోనా టెస్టు శాంపిల్స్ తీయాలని అధికారులను ఆదేశించారు.
ఈ టెస్ట్ ల రిపోర్టులు 24 గంటల్లోగా వచ్చే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఈఓ కోరారు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులు వారం రోజులు ఒకే చోట పనిచేసేలా డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి సెంట్రల్ హాస్పిటల్లో ఉద్యోగుల కోసం కొన్ని వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
పరిస్థితిని సమీక్షించి బర్ద్ ఆసుపత్రిని కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించే విషయంపై వారంలో నిర్ణయం తీసుకుంటామని ఈఓ సింఘాల్ చెప్పారు. తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల సముదాయాన్ని జిల్లా కలెక్టర్ కు అప్పగించాలని జెఈఓను ఆదేశించారు.
టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా క్వారంటైన్ అవసరమైతే మాధవంలో ఏర్పాట్లు చేయాలన్నారు. వీటి పర్యవేక్షణకు ఒక డిప్యూటీ ఈఓ, ఇద్దరు ఏఈఓలు, అవసరమైనంత మంది సిబ్బందిని నియమించి, వైద్య పరికరాలను యూఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పెంచలయ్య, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ , టీటీడీ ఆరోగ్యాధికారి ఆర్ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.