తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిలో మళ్లీ వేగం పుంజుకుంది. దీంతో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరికి ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయనతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.
ఆసుపత్రి వర్గాల కథనం ప్రకారం.... కరోనా అనుమానిత లక్షణాలతో ఆ మాజీ ఎమ్మెల్యేని ఆదివారం ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన తెమడ నమూనాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ ఆసుపత్రికి పంపగా, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ మాజీ శాసనసభ్యుడికి పాజిటివ్ అని తేలడంతో ఆయన భార్య, కొడుకు కూడా ఆసుపత్రిలో చేరారు. వారి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షకు పంపారు.
ఇదిలావుంటే, చెన్నైలో ఉండే సినీ నటి బిందు మాధవి క్వారంటైన్‌లోకి వెళ్లింది. ఆమె తాను నివాసం ఉండే భవనంలోనే 14 రోజులపాటు క్వారంటైన్‌లో గడుపనుంది. ఆమె నివశించే భవన సముదాయంలో ఒకరి కరోనా వైరస్ సోకడంతో ముందు జాగ్రత్తగా బిందు మాధవి క్వారంటైన్‌లోకి వెళ్లింది.
ఈ విషయం తెలుసుకున్న చెన్నై నగర పాలక సంస్థ అధికారులు.. ఆ భవనానికి సీల్ వేసి, శానిటైజ్ చేస్తున్నారు. అదేసమయంలో ఆ భవనంలో ఉండేవారందరినీ క్వారంటైన్‌కు ఉండాల్సిందిగా ఆదేశించారు. దీంతో బిందు మాధవి కూడా 14 రోజుల క్వారంటైన్‌లోకి వెళ్లింది.