ప్రకాశం బ్యారేజీకి మరింతగా వరద వచ్చే అవకాశాలున్నాయని ఏపీ జలవనరుల శాఖామంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఇదే విషయంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశాలున్నాయనీ, గంటగంటకూ నీటిమట్టం పెరుగుతోందన్నారు.
వరద పరిస్థితిపై అంచనాకోసం డ్రోన్లను వినియోగిస్తున్నట్టు చెప్పారు. గత 3 రోజులుగా డ్రోన్లను వినియోగిస్తూనే ఉన్నామనీ, ఇరిగేషన్ శాఖ అనుమతి, ఆదేశాలతోనే డ్రోన్ల వినియోగించారని తెలిపారు. ఎగువ నుంచి వచ్చే వరద వల్ల కరకట్టవెంబడి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయనీ, ఆయా ప్రాంతాల్లోని ప్రజల రక్షణ ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు.
డ్రోన్ల సాయంతో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రాజకీయ పబ్బం కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కరకట్టమీద ఉన్న ఇల్లు నాది కాదని చంద్రబాబు అన్నారనీ, లింగమనేని రమేష్ కూడా అన్నారని చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటి?,
ప్రైవేటు ప్రాపర్టీ కాదని గతంలోనే చంద్రబాబు చెప్పారు. ఆ ఇల్లు మునిగిపోతుందన్న విషయం బయట ప్రపంచానికి తెలియనీయకూడదని చంద్రబాబు ఆరాటపడుతున్నారా? అంటూ నిలదీశారు.
తానుచేసిన తప్పుడు పనులు ప్రజలకు తెలియనీయకుండా చంద్రబాబు అడ్డుకోవడంలేదా? అని అడిగారు.
వరద వస్తే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని ఎప్పుడో చెప్పామన్నారు. ఇప్పుడు ఇసుకబస్తాలు వేసి ఆనీరు పూర్తిగా ఇంటిలోకి రానీయకుండా అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఆ ఇల్లు నాది కాదు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నాదే అని ఎలా అంటున్నారన్నారు.
ఐదేళ్లలో వర్షాలు పడకపోవడంతో, ప్రకాశం బ్యారేజీకి నీరు రాకపోవడంతో చంద్రబాబు ఇల్లు మునిగిపోలేదన్నారు. గత ఐదేళ్ళలో వరద వచ్చి ఉంటే... తన ఇల్లు మునిగిపోకుండా రైతులకు నీరు ఇవ్వడం మాని, చంద్రబాబు గేట్లు ఎత్తివేయించేవారని, అందువల్ల ఇకపైనా డ్రామాలు ఆపి, ప్రభుత్వ విధులను అడ్డుకోవద్దని పిలుపునిచ్చారు.