పీఆర్సీపై తిరుపతిలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. సీఎం ప్రకటనపై అధికారికంగా తమకు ఇంకా తెలియదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పారాజు అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజమైతే స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల సమస్య కాదన్నారు. సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ నిధులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ లాంటి అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిపైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చర్చిస్తామని బొప్పారాజు పేర్కొన్నారు.
తిరుపతి నగరంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్ నోట మరోసారి పీఆర్సీ మాట వచ్చింది. సరస్వతి నగర్‌లో సీఎంను ఉద్యోగులు కలిసారు. పీఆర్సీని ప్రకటించాలని కోరారు. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అయితే పీఆర్సీని మళ్లీ వాయిదా వేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.