Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ సెక్టార్‌లో విప్లవాత్మక మార్పులు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి : పవర్ సెక్టార్లో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 7 రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన సందర్భంగా సచివాలయంలోని 1వ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్ల

Webdunia
శనివారం, 13 మే 2017 (22:19 IST)
అమరావతి : పవర్ సెక్టార్లో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 7 రోజుల అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని వచ్చిన సందర్భంగా సచివాలయంలోని 1వ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన అమెరికా పర్యటన సోలార్ ఎనర్జీ స్టోరేజ్‌కు దోహదపడిందని చెప్పారు. ఈ పర్యటన ద్వారా తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఒక సీఎం అప్‌డేట్ అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులను, సాధారణ పౌరులను పట్టి పీడిస్తున్న వ్యవసాయం, విద్యుత్ రెండు ప్రధాన సమస్యలకు ఈ పర్యటనలో ఒక పరిష్కారం లభించిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
 
ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పాదనకు కూడా జరుగుతున్నట్లు తెలిపారు. సోలార్, విండ్ ఎనర్జీపైన ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. సోలార్ విద్యుత్‌ స్టోరేజ్ అవసరం అని భావించి టెస్లా కంపెనీతో  సంప్రదించినట్లు చెప్పారు. మన ఇంటిపైనే సోలార్ ప్యానల్ పెట్టుకుంటే గృహావసరాలు, కార్లకు అవసరమైన ఇంధనాన్ని వినియోగించుకునే అవకాశాన్ని  టెస్లా అందిస్తోందని వివరించారు. రాబోయే రోజుల్లో మొత్తం ఎలక్ట్రికల్ వాహనాలే ఉంటాయన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు రూ.14 లున్న సోలార్ విద్యుత్ యూనిట్ ధర ఇప్పుడు రూ.3.15లకు పడిపోయిందని తెలిపారు. ప్రస్తుతం రాజస్థాన్ లో రూ.2.45లకు లభిస్తున్నట్లు తెలిపారు. 
 
రాష్ట్రంలో సోలార్ స్టోరేజ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. తొలిదశలో వ్యవసాయ పంపుసెట్లకు వినియోగించనున్నట్లు తెలిపారు.  సోలార్ ఉత్పాదకత, స్టోరేజ్‌తో రెండో దశ విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి, ఫీడర్ స్థాయి విద్యుత్ గ్రిడ్లను రూపొందిస్తామన్నారు. సిలికాన్ వ్యాలీలో వారితో మాట్లాడిన తరువాత ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన  చేసినట్లు చెప్పారు.  భారతదేశ విద్యుత్ రంగాన్ని సమూలంగా మార్చబోతున్న నిర్ణయమన్నారు. ఇది ఒక విప్లవాత్మక ముందడుగుగా అభివర్ణించారు. విప్లవాత్మకమైన సంస్కరణలతో  విద్యుత్ ఉత్పత్తి పెంచి ధరలను తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రపంచానికే భారతదేశం ఒక ఆదర్శంగా నిలిచేలా చేయాలన్నదే తన తపనగా సీఎం పేర్కొన్నారు. 
 
నాలెడ్జ్ ఈజ్ వెల్త్ అని, నాలెడ్జ్ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా వున్నప్పుడు ఏ సెక్టారులో కృషి చేస్తే మనకు ఫలితాలు వస్తాయని ఆలోచించి నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ కోసం ప్రయత్నించామని, అందులో భాగంగానే రాష్ట్రంలోని 30 ఇంజనీరింగ్ కళాశాలను 350కి పెంచినట్లు వివరించారు. ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ఒకరు భారతీయుడు ఉంటాడని, ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువాడు ఉంటాడని చెప్పారు. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయంతో తెలుగు వారు ముందున్నరన్నారు. ప్రొఫెషనల్స్‌గా సంతృప్తి పడరాదని, ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని వారికి సలహా ఇచ్చినట్లు చెప్పారు. కేపీఎంజీ సంస్థ ద్వారా తెలుగువాళ్లు ఎలా ఎదగాలనే అంశంపై అధ్యయనం చేయించినట్లు చెప్పారు. ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో తెలుగువారు వుండాలనేది తన కోరిక అన్నారు.
 
తన అమెరికా పర్యటనలో రెండవ కీలక ఒప్పందం అయోవా యూనివర్శిటీతో జరిగిందన్నారు. అది ఏపీలో మెగా సీడ్ పార్కు ఏర్పాటు అని తెలిపారు. ఐయోవా యూనివర్విటీ ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్విటీ అని చెప్పారు. వ్యవసాయంలో వ్యూహాలను మార్చి హార్టీకల్చర్, ఫిషరీస్, లైవ్ స్టాక్‌పై దృష్టిపెట్టినట్లు తెలిపారు. రెయిన్ గన్స్, నదుల అనుసంధానం, మొబైల్ లిఫ్టులు వంటి వినూత్న  కార్యక్రమాలను అమలుచేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో వున్న బెస్టు టెక్నాలజీని ఏపీకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి నెదర్లాండ్ యూనివర్సిటీ సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రెండు యూనివర్శిటీల సహకారంతో రాష్ట్ర వ్యవసాయరంగంలో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.
 
ప్రపంచంలో అతిపెద్ద ఉత్తమమైన ప్రైవేటు ఆసుపత్రి రోచెస్టర్‌లోని మయో ఆస్పత్రి అని తెలిపారు. ‘పేషెంట్ ఫస్ట్’ అనే ఆశయంతో పనిచేస్తున్న ఈ సంస్థ వైద్యసేవలతో పాటు వైద్యరంగంలో విస్తృత పరిశోధనలు కూడా నిర్వహిస్తోందన్నారు. అక్కడ చికిత్స పొందుతున్న దేవేంద్ర గౌడ్ ను పరామర్శించినట్లు తెలిపారు. అక్కడి క్రమశిక్షణ తనకు చాలా బాగా నచ్చిందని చెప్పారు. మయో స్ఫూర్తితో ప్రభుత్వం త్వరలో ‘పీపుల్స్ ఫస్ట్’ అనే నినాదాన్ని తీసుకుందని, త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీనిపై ప్రకటన చేస్తానని చెప్పారు.  ఆస్పత్రి, పోలీస్ స్టేషన్, రెవిన్యూ కార్యాలయం ఎక్కడైనా ప్రజలు  ఫస్ట్ అని చెప్పారు.
 
సిలికానాంధ్ర యూనివర్శిటీలో మనబడి వంటి కార్యక్రమాలు బాగున్నాయన్నారు.  దాన్ని అభివృద్ది చేయడానికి రూ.6 కోట్లు ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈ వర్శిటీ ద్వారా మన సంస్కృతికి ప్రాధాన్య కల్పిస్తామని చెప్పారు. ఈ పర్యటనలో ప్రవాస తెలుగువారికి సంబంధించిన 55 సంఘాల సభ్యులతో సమావేశమైనట్లు తెలిపారు. తెలుగు ప్రతిష్ట కోసం వారందరిని కలసికట్టుగా ఉండమని, సేవ చేయడంలో పోటీపడమని వారికి చెప్పినట్లు తెలిపారు. యుఎస్ఐబీసీ ట్రాన్స్‌ఫార్మేటీవ్ ఛీఫ్ మినిస్టర్ అవార్డును ఇస్తుంటే దాన్ని రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేసే ఉద్దేశంతోనే అంగీకరించినట్లు తెలిపారు. గతంలో ఎన్ని వర్శిటీలు డాక్టరేట్లు ఇస్తానన్నా వద్దన్నానని చెప్పారు.  తన పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనల సీఈఓలను కలసినట్లు తెలిపారు. సిస్కోలో రియల్ టైమ్ కమ్యూనికేషన్ మెకానిజం గమనించానని, రియల్ టైమ్‌లో ప్రపంచంలోని వివిధ దేశాలలో వున్న తమ సంస్థల పెర్ఫామెన్స్ రిపోర్టులు తెలుసుకునే అవకాశం సిస్కో కార్యస్థానంలో ఉన్నట్లు వివరించారు.
 
గూగుల్ ఎక్స్ కేంద్రంలో డ్రైవర్ లెస్ కార్, బెలూన్స్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రయోగాలు చూశానన్నారు.  ప్రపంచంలో మన రాష్ట్రంలోనే ప్రయోగం  చేయడానికి గూగుల్ ఎక్స్ ముందుకొచ్చిందని చెప్పారు. గూగుల్ ఎక్స్ తన ప్రయోగాలన్నింటికీ ఎపీని  పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడానికి ఒప్పించినట్లు తెలిపారు. యాపిల్ సీఈవో విలియమ్స్‌ను కలిశానని, ఇండియా బిగ్గెస్ట్ మార్కెట్ అని వారికి వివరించి చెప్పానన్నారు.  ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఫిన్ టెక్  రంగంలో అగ్రగామి అని, విశాఖను ఫైనాన్సియల్ సిటీగా అభివృద్ది చేయడానికి ఆసక్తి చూపిందని చెప్పారు.
 
సిస్కో హెడ్ జాన్ ఛాంబర్స్ 1998లో తనతో కలిపి తీసుకున్న ఫోటో చూపించారని తెలిపారు.  క్లౌడ్ మేనేజ్మెంట్‌లో సహకరించేందుకు న్యూటనిక్స్ ముందుకొచ్చిందని,  ఒక నెలలో రోడ్ మ్యాప్ తీసుకొస్తామని చెప్పారు.  గూగుల్ ఎక్స్, యాపిల్, టెస్లా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, సిస్కో, ఫ్లెక్స్‌ట్రాన్సిక్స్, ఎఆర్‌ఎం హోల్డింగ్స్ వంటి అగ్రశ్రేణి సంస్థలతో సమావేశాల్లో పాల్గొన్నట్లు,  ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లాతో మాట్లాడినట్లు చెప్పారు.  ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నామని,  తమకు ఏపీ బాగా నచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ జెన్నిఫర్ జాన్సన్‌ నాతో చెప్పారు. పలు కంపెనీలు రాష్ట్రం పట్ల ఆసక్తి చూపించాయన్నారు. ఈవీఎక్స్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవా సొల్యూషన్స్‌లతో కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి వేల ఉద్యోగాలు రానున్నట్లు చెప్పారు. ఇల్లినాయిస్‌ 7వ డిస్ట్రిక్ట్‌ అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి డేని కె. డెవిస్‌ చేతుల మీదుగా ‘లైట్‌ ఆఫ్‌ ద లైఫ్‌ 2017’ అవార్డు స్వీకరించినట్లు తెలిపారు. 
 
సెమీకండక్టర్, డిస్ ప్లే ఎక్విప్‌మెంట్ తయారీలో ప్రపంచంలోనే ప్రముఖ సంస్థ  అప్లయిడ్ మెటీరియల్స్ కంపెనీ సీఈవో గ్యారీ డికెరన్తోతో మాట్లాడినట్లు చెప్పారు. అప్లయిడ్ మెటీరియల్స్‌ కంపెనీని ఏపీతో ఎలా భాగస్వామిని చేయాలన్న అంశంపై త్వరలో రోడ్‌మ్యాప్‌ సిద్దం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ఏపీని క్లౌడ్ హబ్‌గా రూపొందించడంలో ప్రభుత్వానికి సహకారం అందించేందుకు న్యుటనిక్స్ కంపెనీ ముందుకొచ్చిందని చెప్పారు. మరో రెండు నెలల్లో దీనిపై స్పష్టమైన రోడ్ మ్యాప్, ప్రాజెక్ట్ రిపోర్టుతో వస్తామని న్యుటనిక్స్ సీఈఓ ధీరజ్ పాండే చెప్పినట్లు తెలిపారు.
  
ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్‌ అమరావతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు.  ఐటీ దిగ్గజం జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు తనను కలిశారని, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆయన ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ఐటీ సేవల రంగంలో పేరొందిన, ప్రవాస తెలుగువారు నిర్వహిస్తున్న  అమెరికాలోని 28 సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపినట్లు తెలిపారు. కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ ఎడ్మంట్ గెరాల్డ్ జెర్రీ బ్రౌన్‌ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు. ఇల్లినాయిస్‌ ఎనిమిదో డిస్ట్రిక్ట్‌ యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి రాజా కృష్ణమూర్తితో చికాగోలో సమావేశం జరిగినట్లు తెలిపారు. 
 
ఒకసారి అమరావతిని సందర్శించాలని ఆయనను కోరగా వస్తానని చెప్పినట్లు తెలిపారు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశం అయ్యానని,  మాతృభూమికి ఎన్నడూ దూరం కావొద్దని, పుట్టిన గడ్డతో నిరంతరం సంబంధాలు నెరపాలని సూచించినట్లు చెప్పారు. అలాగే స్థానికులతో అవగాహనతో ఉండి, వారి క్షేమానికి కూడా కొంత ఖర్చు చేయాలని చెప్పినట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనదని, దానిపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.  టెక్నాలజీని వినియోగించుకోకుండా వదిలిపెట్టలేం. అదే సమయంలో సైబర్ సెక్యూరిటీ అవసరం అని,   కళాశాలల్లో కొత్తగా సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం చెప్పారు.  సమావేశంలో సీఎం పక్కన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కూర్చున్నారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికైన వాకాటి సస్పెన్షన్
నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయనపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విచారణ తరువాత ఆయనపై ఆరోపణలు నిజం కాదని తేలితే సస్పెన్షన్ తొలగిస్తామన్నారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments