ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోస్టుల వేలం పాటలు జోరుగా సాగుతున్నాయి. ఈ పదవుల రేట్లు లక్షల్లో పలుకుతున్నాయి. తాజాగా ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం పాట రూ.20 లక్షలతో మొదలై రూ.58 లక్షల వద్ద ముగిసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాలుగో విడతలో జరుగనున్నాయి. అయితే, ఈ మండలంలోని నికరంపల్లె సర్పంచ్ పదవి కోసం తీవ్ర పోటి నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
గ్రామ పెద్దలు మధ్యేమార్గంగా గ్రామ ప్రయోజనాల కోసంతోపాటు వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. దేవుని పాటగా రూ.20 లక్షలతో ప్రారంభమైన పాట చివరకు రూ.58 లక్షలతో ముగిసింది.
టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు. మొత్తం 1750 ఓట్లు ఉన్న ఈ పంచాయతీలో ఆ డబ్బును దేవస్థానం, మసీదు, చర్చిలకు ఆయా సామాజిక వర్గాల ఓట్ల శాతం మేరకు వాటాలు వేసి చెల్లించేలా ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు వేలం పాట జరిగినట్లు సమాచారం. అధికార పార్టీ నియోజకవర్గ నేతలు ఈ సంఘటనపై దృష్టి సారించినట్లు సమాచారం.