Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచండి... డీజీపీకి ఎస్ఈసీ ఆదేశం

Advertiesment
మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచండి... డీజీపీకి ఎస్ఈసీ ఆదేశం
, ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (09:37 IST)
పంచాయతీ ఎన్నికల్లో లక్ష్మణ రేఖ దాటుతున్న వారిపై ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొరఢా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కలెక్టర్లు, ఓ ఎస్పీతో పాటు.. పలువురు ఎస్ఐ, ఇన్‌స్పెక్టర్లను ఇంటికి పంపించారు. తాజాగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. పైగా, మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు వీల్లేకుండా చేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసే ఈ నెల 21 వరకూ దీనిని అమలు చేయాలని ఆదేశిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. 
 
రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కే ప్రకారం ఈమేరకు కమిషన్‌ నిర్ణయం తీసుకుందన్నారు. బలవంతపు ఏకగ్రీవాలను కూడా ఆమోదించాలన్న మంత్రి ఒత్తిడి ప్రభావం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, ఓటర్లపై పడే అవకాశం ఉందన్నారు. 
 
మంత్రి వైద్య పరీక్షలకు వెళ్లొచ్చని, అయితే ఈ సందర్భాల్లో మీడియాతోగాని, తన అనుచరులు, మద్దతుదారులతో మాట్లాడకూడదన్నారు. ఆఫీసు కార్యక్రమాలను యధావిధిగా ఇంటి నుంచి నిర్వహించుకోవచ్చన్నారు. ప్రజాభీష్టం మేరకే మంత్రిపై ఈ నిబంధనలు విధించామని స్పష్టం చేశారు. 
 
ఏవైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఈ నిబంధనల్లో మార్పు చేర్పులు ఉంటాయని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విస్తృత అధికారాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్‌మార్క్‌ తీర్పులు ఉన్నాయని నిమ్మగడ్డ గుర్తుచేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల ప్రక్రియను పట్టించుకోని సందర్భాల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వంలో ఉన్నత పదవులు, విస్తృతాధికారాలు కలిగిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బలవంతపు ఏకగ్రీవాలకు పిలుపివ్వడం... స్వేచ్ఛ, నిష్పాక్షిక ఎన్నికలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. అందుకే ఆయన్ను హౌస్ అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయడం ఖాయం : కేంద్ర మంత్రి ఠాగూర్