Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ అందుబాటులో మద్యం, మాదకద్రవ్య విమోచన కేంద్రాలు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (17:25 IST)
మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని తిరిగి సమాజ జీవనంలోకి తీసుకువచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా డిజిటల్ విధానంలో శుక్రవారం ఈ కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించగా, మహిళాభివృద్ది, శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా విమోచనా కేంద్రాలను గురించిన వివరాలను ప్రకటించారు.
 
మన పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖపై సిఎం సమీక్ష నిర్వహించారు. విమోచన కేంద్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, మహిళాభివృద్ది, శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ కార్యదర్శి దమయంతి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సంచాలకులు కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
 
దశలవారిగా మద్య నిషేదం అమలుకు సిఎం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఈ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాదకద్రవ్యాల వినియోగ తగ్గింపులో భాగంగా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహకారంతో విభిన్న ప్రతిభావంతులు, లింగమార్పిడి, వయోవృద్దుల విభాగం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ క్రమంలో 15 ప్రభుత్వ ఆసుపత్రులలో మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటి నిర్వహణ కోసం సంవత్సరానికి 4.98 కోట్లు వ్యయం చేయనున్నామని కృతికా శుక్లా తెలిపారు.
 
ఈ పదిహేను కేంద్రాలలో బయటి రోగుల సేవలతో పాటు ఇన్‌పేషెంట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని, డాక్టర్, కౌన్సిలర్లు ప్రతిరోజూ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు  ఈ కేంద్రాలలో సేవలకు సిద్దంగా ఉంటారని వివరించారు.  పూర్తి సమయం, సహాయం అవసరమయ్యే కేసులకు ఇన్‌పేషెంట్ విధానంలో వైద్యం అందిస్తారన్నారు.  మద్యం, మాదకద్రవ్య వ్యసనాల నుండి బయటపడటానికి పూర్తి ఉచితంగా చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆక్రమంలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు.
 
ప్రతి కేంద్రం 15 పడకల సామర్ధ్యం కలిగి ఉంటుందని, అన్ని కేంద్రాలలో  ఒక మానసిక వైద్య చికిత్సా నిపుణుడు, ఎంబిబిఎస్ అర్హత కలిగిన వైద్యులు, ముగ్గురు కౌన్సిలర్లతో సహా 11 మంది సిబ్బంది ఉంటారన్నారు. ఈ కేంద్రాలలో నియమించబడిన సిబ్బందికి ఎయిమ్స్ లోని నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించామని,  అన్ని రకాల మౌళిక సదుపాయాలతో ఈ కేంద్రాలను తీర్చిదిద్దామని స్పష్టం చేసారు.
 
వైద్యుని గదితో పాటు, కౌన్సిలర్ల గది, 15 పడకల ఇన్-పేషెంట్ వార్డ్, అవుట్ పేషెంట్ వార్డ్, వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేసామని డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఈ సంవత్సరం చివరి నాటికి, ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 25 విమోచన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేసామన్నారు.  తద్వారా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక విమోచన కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు.
 
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ – శ్రీకాకుళం, జిల్లా ఆసుపత్రి – విజయనగరం, కింగ్ జార్జ్ హాస్పిటల్ – విశాఖపట్నం, జిల్లా ఆసుపత్రి – పాడేరు, జిల్లా ఆసుపత్రి – రాజమండ్రి,  ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – కాకినాడ, జిల్లా ఆసుపత్రి – ఏలూరు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ - విజయవాడ,  ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – గుంటూరు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – ఒంగోలు, డిఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ – నెల్లూరు,  ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – కడప, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – కర్నూలు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – అనంతపురం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ – తిరుపతిలలో ఈ కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
 
ఎన్‌డిడిటిసి, ఎయిమ్స్, భారత ప్రభుత్వం గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభాలో 10 నుండి 75 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో 13.7% మంది ప్రస్తుతం మద్యం వినియోగిస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయటమే ప్రభుత్వ ధ్యేయమని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు. రాష్ట్రంలో మద్యం కారణంగా సుమారు 47 లక్షల మంది, అదే క్రమంలో ఓపియాయిడ్ సమస్యలకు సుమారు 3.6 లక్షల మందికి సహాయం అవసరమై ఉందన్నారు. గంజాయి వాడకం వల్ల సమస్యలు ఎదుర్కుంటున్న సుమారు 1.08 లక్షల మంది, మత్తుమందుల బాధితులు సుమారు 1.4 లక్షల మంది రాష్ట్రంలో సహాయం కోసం వేచి ఉన్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments