నిత్య పెళ్లి కొడుకుల సంగతి వినే వుంటాం. కానీ ఇక్కడ నిత్య పెళ్లి కూతురు దొరికిపోయింది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన నేరగాళ్ల గురించి వినే వుంటాం. అయితే ఇక్కడ ఓ మహిళ ఒకరు ఇద్దరు కాదు.. ఆరుగురిని పెళ్లి చేసుకుంది. ఈ కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా, మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికను ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి మూడు నెలల క్రితం వివాహం చేశారు. అమ్మాయి అందంగా వుండటంతో ఎదురు కట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన మూడునెలల తర్వాత తండ్రి అనంతరెడ్డి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు.
కానీ భర్త తన భార్య పుట్టింటికి వెళ్లలేదని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె నిత్య పెళ్లి కూతురు అని.. ఇప్పటి వరకు ఆరుగురుని పెళ్లి చేసుకుందని తేల్చారు. కేవలం బంగారం కోసమే వీరందరినీ పెళ్లి చేసుకుందని.. ఆమెకు తండ్రి సహకరించాడని తెలిసింది. దీంతో పోలీసులు మౌనికను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.