Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీసం తీస్తానన్న మంత్రి ఎక్కడ....?: నారా లోకేశ్

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (05:26 IST)
తమది రైతుసంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరకు రైతుదగా ప్రభుత్వంగా మారిందని, అకాలవర్షాలు, వరదలవల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంమానేడంతోపాటు, అన్నదాతలకు బేడీలు వేసే నీచస్థాయికి దిగజారిందని, రైతులపక్షాన నిలిచినందుకు సిగ్గులేకుండా తనపై విమర్శలు చేస్తోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేశ్ మండిపడ్డారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో రైతులకు జరుగుతున్నఅన్యాయాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టడంతో పాటు, వైసీపీప్రభుత్వ చట్టవ్యతిరేక నిర్ణయాలను, రాజ్యాంగ విరుద్ధపా లనను విలేకరులసాక్షిగా తూర్పారబట్టారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...! 
 
వరదలు, అకాల వర్షాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులను పరామర్శించడానికి ఐదు జిల్లాల్లో పర్యటించాను. రైతులకు న్యాయంచేయండి, వారిని ఆదుకోండని నేను అంటుంటే, జగన్ ఆయన తోడు దొంగలు లోకేశ్ ఏహోదాలో తిరుగుతున్నాడంటున్నారు. నాకు హోదాలతో, వందిమాగదులతో పనిలేదు. మానవత్వం ఉంది. 

అందుకే రైతులకోసం వెళ్లాను. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు, వారికి అండగా నిలవకూడదా? ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోబట్టే, తాను వారి వద్దకు వెళ్లడం జరిగింది. రైతులకోసం పొలాల్లో తిరిగే తనను ఒక మంత్రి  ఎద్దు అన్నాడు. అలాంటప్పుడు తూతూమంత్రంగా గాల్లోతిరిగే ముఖ్యమంత్రిని దున్నపోతు అనాలేమో ఆ మంత్రే సమాధానం చెప్పాలి. 
11 జిల్లాల్లో 215 మండలాల్లో పంట నష్టం జరిగింది. 10వేలఇళ్లవరకు దెబ్బతిన్నాయి.

వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పసుపు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక ఇంటికి నిత్యావసరాలు అందచేయాలంటే, ఆ ఇల్లు వారంరోజులు నీళ్లలో ఉండాలా?   మానవత్వం ఉంటే అలా ఎవరైనా చెబుతారా? వరదప్రాంతాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన ప్యాకేజీ తమకు అందలేదని కొల్లేరు వాసులు చెప్పారు.  ఉభయగోదావరిజిల్లాల్లో ఇప్పటివరకు మూడు సార్లు వరిముంపునకు గురైంది. 

సొంతభూమి ఉన్నవారికి ఎకరాకు రూ.25వేల వరకు ఖర్చైంది. కౌలు రైతులకు రూ. 30 నుంచి 35 వేలదాకా అయింది.  అనంతపురంలో 10లక్షల ఎకరాల్లో వేరుశనగ దెబ్బతిన్నది. ఎన్నికలకు ముందు రైతు రాజ్యం వస్తుందని చెప్పిన జగన్, ఇప్పుడు రైతులేని రాజ్యంగా రాష్ట్రాన్ని తయారుచేశాడు. అకాల వర్షాలు, వరదల కారణంగా పంటలు దెబ్బతింటే ఆదుకోవాల్సింది ప్రభుత్వమే.

టీడీపీప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాపై తిత్లీ ప్రభావం చూపినప్పుడు 28 రోజుల్లో రూ.160కోట్లు ఇచ్చాము. మంత్రులు, అధికారలు మండలాలవారీగా విభజించుకొని రేయింబవళ్లు పనిచేశారు.  జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ ఇప్పటివరకు విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు కేవలం రూ.25లక్షలు ఇచ్చారు. ఇన్ పుట్ సబ్సిడీ కింద టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,759కోట్లు అందించడం జరిగింది.

ఈ ప్రభుత్వం వచ్చాక రూ.63కోట్లకు జీవోఇచ్చారు. నా పర్యటన తరువాత మరో రూ.120కోట్లకు జీవో ఇచ్చారు. దానిలోఒక్క రూపాయికూడా రైతులకుఅందలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రూ.15,279 కోట్లతో రైతురుణమాఫీ చేశారు.  రూ.50వేల లోపు రైతురుణాలను ఒకేసారి రద్దుచేశారు. అన్నదాతా సుఖీభవ కింద ప్రతిరైతుకు రూ.15 వేల వరకు ఇచ్చాము.

దానికి బదులుగా తాను అధికారంలోకి వస్తే, ప్రతిరైతుకు రూ.12,500ఇస్తానని జగన్ రెడ్డి చెప్పాడు.  జగన్ రూ.12,500 ఇస్తే, కేంద్రం నుంచి  రూ.6వేలువస్తే, మొత్తం రూ.18,500లు వస్తాయని రైతులు భావించారు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చాక, కేంద్రంసొమ్ముతో  కలిపి,  రూ.13,500 మాత్రమే ఇస్తున్నారు. ఆ విధంగా ఒక్కో రైతుకు రూ.25వేలవరకు మోసంచేశారు. దానితోపాటు రైతుల సంఖ్యను ఏటికేడు దారుణంగా తగ్గించారు.

వైసీపీప్రభుత్వం తమ బడ్జెట్లో 64 లక్షలమందికి రైతుభరోసా ఇస్తామని చెప్పి, మొదటిఏడాది 54లక్షలకు పరిమితం చేశారు. రెండోఏడాదికి ఆ సంఖ్య 50.47లక్షలకు పరిమితం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక 14లక్షలమంది రైతులు వ్యవసాయం చేయడం మానేశారా?

రైతుభరోసాలో కోతపెట్టడం గానీ, రైతుల సంఖ్య తగ్గించడం ద్వారా గానీ, ఐదేళ్లకు చూస్తే జగన్ ప్రభుత్వం రూ.25వేలకోట్ల వరకు ఎగ్గొట్టింది.  అదేవిధంగా రాష్ట్రంలో కౌలురైతులు 15లక్షలమంది వరకు ఉన్నారని వ్యవసాయమంత్రి కన్నబాబు శాసనసభలో చెప్పారు.  ప్రభుత్వం చేసే సాయం విషయానికి వచ్చేసరికి వారి సంఖ్య అమాంతం పడిపోయింది.
2019-20సంవత్సరంలో కేవలం 54వేలమంది కౌలురైతులకు మాత్రమే జగన్ రెడ్డి రైతుభరోసా అమలుచేశారు.

ఈ ఏడాదికి వచ్చే సరికి ఆసంఖ్య 41వేలకు కుదించబడింది. తమ మతం రైతు, తమకులం రైతు, తమ పార్టీ రైతుపార్టీ అని,  అలాంటప్పుడు రైతులకు కులమతాలు అంటించడమేంటని గోదావరి జిల్లాల రైతులు తనఎదుట వాపోయారు. భారతదేశంలో రైతులకు కులమతాలు అంటించిన తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే.

డ్రిప్ ఇరిగేషన్ విధానానికి సబ్సిడీ, రైతురథాలు, రాయితీపై యంత్రపరికరాలు, హర్టీకల్చర్ సాగును జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది.  టీడీపీ హాయాంలో వ్యవసాయరంగ వృద్ధిరేటు 11శాతం ఉంటే, ఇప్పుడేమో సున్నాకు చేరింది. 
రూ.3,500కోట్లవరకు తమప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ కింద రుణాలు అందిస్తుందని చెప్పిన జగన్, మరుసటిరోజు బడ్జెట్లో సున్నావడ్డీ పథకానికి రూ.100కోట్లు మాత్రమే కేటాయించారు. 

ఆ 100కోట్లు కూడా రైతులకు అందలేదు. సున్నా వడ్డీ రుణాల్లో  మొత్తంగా రైతులకు అందింది సున్నానే. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను జగన్ సకాలంలో ఎందుకు ఆదుకోరు? కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకుండా పిచ్చిపిచ్చి షరతలు, నిబంధనలు పెట్టడమేంటి? టీడీపీ హాయాంలో బడ్జెట్లో వ్యవసాయరంగానికి తొలిఏడాది రూ.6వేలకోట్లు కేటాయిస్తే, తరువాత దాన్ని ఏటికేడుపెంచుతూ, రూ.19వేలకోట్లకు పెంచాము.

రైతు రాజ్యమని చెప్పే జగన్మోహన్  రెడ్డి ఆ మొత్తంలో రూ.7వేలకోట్ల వరకు కోతపెట్టి, రైతులకు గుండెకోత మిగిల్చాడు. కనీసమద్ధతుధరపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతప్ప, దానిపై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి, వారి వద్దనున్న పంటలుకొనుగోలు చేసింది లేదు. కనీసమద్ధతు ధరకింద రూ.3వేలకోట్లు కేటాయించామన్నారు. కానీ రైతులకు అందింది సున్నామాత్రమే.

ఎక్కడైనా పంటలు కొన్నా, ప్రభుత్వం ద్వారా లబ్దిపొందింది దళారులేగానీ, రైతులు కాదు. నెల్లూరుజిల్లాలో ధాన్యంరైతులు గిట్టుబాటుధర లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పంటలబీమా సొమ్ము జగన్ ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల రైతులకు అందాల్సిన రూ.1800కోట్లు నిలిచిపోయాయి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంటల బీమాకు సంబంధించి రైతులెవరూ రూపాయి కట్టాల్సిన పనిలేదన్న జగన్ రెడ్డి,  అధికారంలోకి వచ్చాక ప్రభుత్వవాటాగా చెల్లించాల్సిన సొమ్ముకే ఎగనామం పెట్టి, రైతుల నోట్లో మట్టిగొట్టాడు. ధాన్యం కొనుగోలు తాలూకా రూ.2వేలకోట్ల వరకు బకాయిలు 17నెలలైనా రైతులకు చెల్లించలేదు.
                                                                                                                                                        మీసం తీస్తానన్న మంత్రి ఎక్కడ....?
టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో 23సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి, 32లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. పోలవరంలో 70శాతం పనులు పూర్తి చేశాము. జగన్ వచ్చాక కేవలం 2శాతం మాత్రమే చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు 70శాతం పూర్తయితే, మీసాలు తీసేస్తానన్న మంత్రి ఇప్పుడెక్కడున్నాడో తెలియదు.

పోలవరంప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి 2013 భూసేకరణ చట్టంప్రకారం ఆర్ అండ్ ఆర్, ఇతర కాంపోనెంట్స్ కింద వ్యయంపెరిగినందున ప్రాజెక్ట్ కు  రూ.55వేలకోట్ల వరకు ఇవ్వాలని చంద్రబాబు కోరితే, కేంద్రప్రభుత్వం ఒప్పుకుంది. ఆనాటి కేంద్రమంత్రి గడ్కరీ చెప్పిన సమాధానమే అందుకు నిదర్శనం. 

ట్వీట్ రెడ్డి, ఏ2 రాజ్యసభలో ఇదే అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం కూడా తాము రూ.55వేలకోట్లకు ఒప్పుకున్నట్లు స్పష్టంగా చెప్పింది. ఇవన్నీ మర్చిపోయి, కేంద్రాన్ని నిలదీసి నిధులు తేవడం చేతగాక, చంద్రబాబుపై నిందలేస్తే ప్రజలు నమ్ముతారా? 22 మంది ఎంపీలను గెలిపిస్తే, కేసుల మాఫీకోసం ప్రాజెక్ట్ అంచనావ్యయాన్ని జగన్మోహన్ రెడ్డి రూ.25వేలకోట్లకు కుదించారు. 

ప్రత్యేకహోదా, పోలవరం కోసం ఢిల్లీనిపొడుస్తా, పరిగెత్తిస్తా అన్నవారు, తమఎంపీల చేతగానితనం కారణంగా రాష్ట్రానికి రూ.30వేలకోట్ల వరకు నష్టం మిగిల్చారు. ఇవన్నీ అలా ఉంటే, రైతులను కేంద్రానికి తాకట్టు పెట్టి, మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారు. రైతులను కేంద్రానికి తాకట్టు పెట్టే బదులు, బెంగుళూరు, హైదరాబాద్ లో జగన్ కు ఉన్న ప్యాలెస్ లతోపాటు, చైన్నైలో నిర్మాణంలో ఉన్న మరో ప్యాలెస్ సహా,  భారతి సిమెంట్స్ ని తాకట్టు పెట్టి, జగన్ రెడ్డి రైతులను ఆదుకోవచ్చుగా?

ఈ విధంగా మోటార్లకు మీటర్లు పెట్టి వారిని దోచుకోవడం ఏమిటి? 1983లో అన్న ఎన్టీఆర్ రైతుల మోటార్లకున్న మీటర్లను పీకిం చేశారు. తిరిగి ఇన్నేళ్లతరువాత రైతువ్యతిరేకి జగన్ రెడ్డి తిరిగి మీటర్లు బిగిస్తున్నాడు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే, వాటినిపీకేసి, సైకిళ్లకుకట్టి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తంచేస్తామని టీడీపీతరుపున హెచ్చరిస్తున్నా.

నెల్లూరుజిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని బయటపెడితే, జయపాల్ అనే దళితరైతుని పోలీస్ జీప్ ఎక్కిస్తారా? ప్రభుత్వంతో కలిసి దళారులు రైతుల సొమ్ముని దోచుకుంటున్న వైనాన్ని బయట పెట్టడమేనా అతను చేసిన నేరం?  ఏం తప్పుచేశారని కృష్ణాయ పాలెం రైతులకు బేడీలువేస్తారు? వారి పిల్లలు అడిగే ప్రశ్నలకు  ఈప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?

రేపు తాముస్కూళ్లకు వెళితే, తమ తండ్రులకు ఎందుకు బేడీలు వేశారని, తమ స్నేహితులు అడిగితే ఏం చెప్పాలని సదరురైతుల పిల్లలు తనను అడిగారు. రైతుదగా ప్రభుత్వంలో తమకు జరిగిన అన్యాయంపై రైతులు ప్రశ్నిస్తే, వారిని అరెస్ట్ చేస్తారా?

ప్రతిరైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.లక్ష నుంచి రూ.5లక్షలవరకు ఇస్తానన్న జగన్ రెడ్డి, నేడు  రైతులకు బేడీలు వేయించి జైలుకు పంపాడు.బేడీల ఘటనపై ముఖ్యమంత్రి, డీజీపీ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటే, ఒక్కరూ స్పందించలేదు. 

సొంతపత్రికకు ప్రకటనలరూపంలో వందలకోట్లు ఇచ్చే ప్రభుత్వం, రైతులకు మాత్రం రూపాయి ఇవ్వడం లేదు. 
జగన్ ప్రభుత్వంలో 750మంది రై తులు ఆత్మహత్యలు చేసుకోవడమేనా జగన్ చెప్పిన రైతురాజ్యం.                                                                   
రైతులకు సంబంధించి జగన్ ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లు ఉంచుతున్నాం. వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన పంటల వివరాలను నూటికినూరుశాతం సరిగా నమోదుచేసి, ప్రతి ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలనేది తొలి డిమాండ్.  ఆక్వాసాగు కారణంగా దెబ్బతిన్నరైతులను  కూడా కచ్చితంగా గుర్తించి, ఎకరాకు రూ.5లక్షల వరకు పరిహారం ఇవ్వాలి. 

మూడో డిమాండ్ ఏమిటంటే, అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను గుర్తించి, ఆయా రైతులను  కూడా ఆదుకోవాలి.  వరదల కారణంగా ఉపాధి కోల్పోయి, సర్వం కోల్పోయిన ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి.  రైతులు ఎల్లకాలం గోచీలతో బతకాలనే శాశ్వత కలేదో జగన్ రెడ్డి ఉన్నట్లుంది.

రైతుల జోలికివస్తే,  జగన్మోహన్ రెడ్డికే  ఆగోచీ కట్టి, వారేఆయన్ని తన్నేరోజు వస్తుందని హెచ్చ రిస్తున్నా. 
రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ లని, వారు టీషర్టులు వేసుకోవడమేంటి.. సెల్ ఫోన్లు వాడటమేంటి అని కించపరిచేలా మాట్లాడటం  మానుకోవాలి.  జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆకాశం నుంచి నేలకుదిగి, రైతులను ఆదుకోవాలని కోరుతున్నా.

కేంద్రం పెట్టే ప్రతి బిల్లుకి మద్ధతు తెలిపే ముందు, జగన్మోహన్ రెడ్డి, పోలవరానికి నిధులివ్వాలని, ప్రత్యేకహోదా ఎందుకివ్వరని ఢిల్లీ పెద్దలను ఎందుకు ప్రశ్నించరు?  అధికారంలో ఉంది చంద్రబాబునాయుడా.. జగన్మోహన్ రెడ్డా..? ఆయన హ్యంగోవర్ లోనుంచి బయటకు వస్తే మంచిది. 

రైతులకు ఇవ్వడానికి డబ్బులేదనే వాళ్లు, సాక్షి పత్రికకు ప్రకటనలివ్వడానికి ఖర్చు చేసే వందలకోట్లు, ఇసుక, మధ్యం, సిమెంట్, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంద్వారా  వచ్చిన సొమ్మంతా ఏం చేస్తున్నారు?  రైతురుణమాఫీ కింద లబ్ది పొందని రైతులను ఆదుకోవడానికి తమప్రభుత్వం ‘ అన్నదాతా సుఖీభవ’ పథకం తీసుకొచ్చింది.  90శాతం మందిరైతులను చంద్రబాబు పూర్తిగా ఆదుకున్నారు.

ఇప్పుడున్నవాళ్లలా రైతలసంఖ్య కుదించడం, కులం-మతం అంటగట్టడం చేయలేదు. ఈప్రభుత్వంలో రైతులకు రూ.25 వేలవరకు నష్టంచేయలేదు.  జగన్మోహన్ రెడ్డి గన్నేరుపప్పు, ఆయన పాలనలో ఏవర్గం వారు సంతోషంగా లేరు.  అమరావతిప్రాంతవాసులకే కాదు, ఏపీ ప్రజలెవరకీ  జగన్ ప్రభుత్వంలో మనశ్శాంతి లేదు.
  
ప్రభుత్వం కేసు పెట్టాకే, ట్రాక్టర్ని కూడా ర్యాష్ గా నడపొచ్చని నాకు తెలిసింది. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు లక్షలకోట్ల అవినీతిఅని, ఇన్ సైడర్ ట్రేడింగ్ అని చెప్పినవారు, చివరకు అవేవీ నిరూపించలేక తనపై ట్రాక్టర్ డ్రైవింగ్ కేసు పెట్టారు.  టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం అయిపోయింది. ఇప్పుడేమోరైతులపై పెడుతున్నారు. భవిష్యత్ లో మీడియా వారిపై పెడతారు. 

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల్లో ఎక్కడాకూడా రైతుల మోటార్లకు మీటర్లు బిగించే నిబంధన లేదు. కనీస మద్ధతుధర, మార్కెటింగ్ అంశాలకు సంబంధించి, రాజ్యసభ లోక్ సభల్లో తమపార్టీ ఎంపీలు రైతులకు ఉపయోగకరంగా ఉండేలా కేంద్రానికి చేయాల్సిన సూచనలు చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టే నిబంధనను బీజేపీ ముఖ్యమంత్రులే వ్యతిరేకిస్తుంటే, జగన్ రెడ్డి ఒక్కడే ఎందుకు ఒప్పుకున్నాడు? పక్కనున్న కేసీఆర్ కూడా వ్యతిరేకించారు కదా?

మీటర్ల తయారీ, బిగింపునకు సంబంధించి అప్పుడే టెండర్లు ఎందుకు పిలిచారు?  రైతులను ఆదుకోవడానికి మనస్సుండాలి.. మానవత్వం ఉండాలి,  డబ్బుకాదు. జగన్ రెడ్డికి ఆ రెండూ లేవు. రైతులకు చేసే సాయం విషయం సహా, ఆయన ప్రతి అంశాన్ని, ఆర్థికకోణంలో నుంచే చూస్తున్నారు.   ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల, జగన్ అసమర్థత వల్ల ఇంకెంతమంది అన్నదాతలు చనిపోతారోననే భయం కలుగుతోంది.

తమకుటుంబం ప్రకటించిన ఆస్తులకంటే, ఒక్క రూపాయి ఎక్కువున్నా తిరిగిచ్చేస్తానని చెబితే, జగన్ రెడ్డి దాన్ని నిరూపించలేక పోయాడు. గతంలో కూడా సింగపూర్లో హోటల్ ఉందన్నారు. ఎక్కడుందో  చెప్పమంటే ఇప్పటి వరకు సమాధానం లేదు.  ఫైబర్ గ్రిడ్ విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలు, ఉత్తరప్రత్యుత్తరాలన్నీ దాచేసి, లోకేశ్ సంతకాన్ని మాత్రమే  పట్టుకొని నిందలేశారు. అందులో జరిగిన అవినీతిని  నిరూపించమంటే తోకముడిచారు.

పోలవరం పనులకు సంబంధించి మీసాలు తీస్తానన్న మంత్రి తీశాడా.. తమపై నిందలు, అభాండాలు వేసేవారు వాటిని నిరూపించమంటే కనిపించడం లేదు. సీబీఐ విచారణను తామెందుకు వ్యతిరేకిస్తున్నాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ వ్యతిరేకించలేదు.  ఏపీప్రభుత్వంలోని సీబీసీఐడీ, ఏసీబీ పనికిరానివని జగన్ ఒప్పు కుంటారా? అలా అయితేనే కదా సీబీఐ విచారణ కోరేది.

జగన్ మాత్రం బెయిల్ పై బయట తిరగొచ్చు గానీ, తాము మాత్రంన్యాయపోరాటం చేయకూడదా? అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసేసి, బురద జల్లుతాం కడుక్కోండి అంటే సరిపోతుందా? వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ వద్దని జగన్ ఎందుకు అన్నాడు. హత్య జరిగినప్పుడు ముందు సీబీఐ విచారణ కావాలని కోరి, తరువాత ఎందుకు వద్దన్నాడు? అధికారమదంతో చట్టాన్ని జగన్ ఉల్లంఘి స్తున్నప్పుడు,

తాము కోర్టులకు వెళ్లడంతప్పెలా అవుతుంది. బెంజి మినిస్టర్ బాగోతాన్ని, హావాలా సొమ్ము పక్కరాష్ట్రానికి తరలిస్తున్న మంత్రి వ్యవహారాన్ని బయటపెట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.  పరిపాలన ఒకేచోట ఉండాలి... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే టీడీపీ అభిమతం. అదే విధానాన్ని అధికారంలో ఉన్నప్పుడు కూడా అమలుచేశాం. అనంతపురానికి కియా తీసుకొస్తే, కర్నూల్లో సోలార్ పార్క్, మెగాసీడ్ పార్క్ తీసుకొచ్చాం.

విశాఖకు మెడ్ టెక్ జోన్,ప్రకాశం జిల్లాకు పేపర్ పరిశ్రమ తీసుకొచ్చాం.  అమరావతి విషయంలో ఎప్పుడూ ఒకేమాటకు కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీనే. అమరావతి ఉద్యమంకోసం చంద్రబాబు జోలెపట్టి తిరిగారు.. అంతకంటే చిత్తశుద్ధి ఏముంటుంది. నాతల్లి తన రెండు బంగారుగాజులు ఉద్యమానికి బాసటగా ఇచ్చేశారు. స్థానిక సంస్థలఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాముసిద్ధమే. 

ఎన్నికలు నిర్వహించాలంటే తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలి. బలవంతంగా జరిపించిన ఏకగ్రీవాలపై విచారణ జరపాలి. అధికారబలంతో జరిగిన వాటన్నింటినీ రద్దుచేయాలి.   ఎన్నికల నిర్వహణపై వైసీపీ తొలినుంచీ రెండునాల్కల ధోరణితో ఉంది.  తప్పుచేసినవారికి అనుకూలంగా కోర్టులు తీర్పులు చెబుతాయా?  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కోర్టులు అనేకఅంశాలను తప్పుపట్టాయి.

ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధంగా, చట్టానికి అతీతంగా నిర్ణయాలు తీసుకోబట్టే న్యాయస్థానాలు  తప్పుపడుతున్నాయి. అధికారంలో ఉండి, ఈ విషయం కూడా తెలుసుకోకపోతే ఎలా?  అప్పనంగా 43వేలకోట్లు దొబ్బేసి, 16నెలలు జైలుకు వెళ్లొచ్చినవ్యక్తి, కోర్టులను, న్యాయమూర్తులను తప్పుపట్టడమేంటి?  రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతిభద్రతలు,చట్టం అనేవి అమలుకావడం లేదు. 

దళితరైతులకు బేడీలువేస్తే, హోంమంత్రిగా ఉన్నదళిత మహిళ స్పందించకపోవడం బాధాకరం.  పేదలకు ఇచ్చే ఇళ్లస్థలాలు నివాసయోగ్యంగా ఉండాలి. మంచిరోడ్లు, విద్యుత్ సదుపాయం, నీటివసతి, డ్రైనేజ్ సౌకర్యం కల్పించి,  జనావాసాలకు దగ్గరగా ఉండేలా స్థలాలివ్వాలి.  ఇళ్లస్థలాలపై ఎవరు కోర్టుకెళ్లారో...ఎక్కడవెళ్లారో తనతో చర్చించడానికి మంత్రి సత్తిబాబు సిద్ధమేనా? 

ప్రభుత్వం పేదలకు ఇస్తామన్న ఇళ్లస్థలాల్లో 90శాతం భూమిపై ఎటువంటి కేసులు, అభ్యంతరాలు లేవు. అటువంటప్పుడు దాన్ని ఎందుకు పేదలకు ఇవ్వడం లేదో సత్తిబాబు చెప్పాలి?  ఇళ్లస్థలాలపై ఎవరు కోర్టుకెళ్లారో, ఏపార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు వెళ్లారో,  ఆధారాలతో సహా నిరూపించడానికి తానుసిద్ధం. మంత్రి సత్తిబాబు అందుకు సిద్ధమేనా?

నకిలీవార్తలు, అభూతకల్పనలు, అవాస్తవాలు సృష్టించడంలో మంత్రులను మించినవారు లేరు. వైసీపీవాళ్లలా ప్రెస్ మీట్లలో విలేకరులకు సమాధానం చెప్పకుండా తానేమీ పారిపోవడం లేదు. ఎవరూ అడగకుండానే, దమ్ము, ధైర్యంతో నిజాయితీగా ఏటా తమ కుటుంబ ఆస్తులను ప్రకటిస్తున్నాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments