దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్.షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఈ పార్టీకి వైఎస్ఆర్ టీపీ అని పేరు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 9న ఆమె ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు.
ఈ క్రమంలో త్వరలోనే తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్న వైఎస్ షర్మిల నేడు 10 జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించబోతున్న సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫిబ్రవరి 9 నుంచి తాను ఎంతోమందిని కలిశానని, ప్రతి ఒక్కరూ రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలని కోరుతున్నారని వెల్లడించారు. ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన రోజని, అందుకే ఆ రోజున బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
రాష్ట్రంలో పరిస్థితుల పట్ల ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తానున్నానని షర్మిల భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారం సాధిస్తుందని ధీమా వెలిబుచ్చారు. తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని, వైఎస్సార్ పేరు చాలని ఉద్ఘాటించారు.
మరోవైపు, ఏప్రిల్ 9న ఖమ్మంలో తొలి బహిరంగసభకు పోలీసులు ఎట్టకేలకు అనుమతించారు. దీంతో సభకు జనసమీకరణతో పాటు ఇతర అంశాలపై పార్టీ నేతలతో షర్మిల చర్చలు జరిపారు. అనంతరం సంకల్ప సభ వాల్ పోస్టర్‌ను విడుదల చేస్తారు.
అయితే, ఈ సభను షర్మిల లక్ష మందితో నిర్వహించాలని భావిస్తే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 6,000 మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు.
అంతేకాదు, సభలోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పారు. దీంతో ఈ సభకు ఎంత మందిని అనుమతిస్తారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. సభతో తొలిసారి తెలంగాణ ప్రజల ముందుకు రావాలనుకుంటున్న షర్మిలకు ఆదిలోనే అవాంతరాలు ఎదువుతున్నాయి.