శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ధనుస్సు ధరించి కోదండరాముని అలంకారంలో దర్శనమిచ్చారు.
హనుమంత వాహనం - భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు.
గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. కాగా, మధ్యాహ్నం 3 గంటలకు పుష్పక విమానం, రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డా. నిశ్చిత, చిప్పగిరి ప్రసాద్, గోవిందహరి, డిపి.అనంత, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పేష్కార్ జగన్‌మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.