Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెవిలో దర్జాగా బ్లూటూత్ పెట్టుకుని పరీక్ష రాసిన ఎమ్మెల్యే పుత్రరత్నం... ఎక్కడ?

చెవిలో దర్జాగా బ్లూటూత్ పెట్టుకుని పరీక్ష రాసిన ఎమ్మెల్యే పుత్రరత్నం... ఎక్కడ?
, బుధవారం, 21 అక్టోబరు 2020 (09:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతలు అధికార బలంతో పెట్రేగిపోతున్నారు. అధికారం ఉందికదాని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం నాయకులు అనుకుంటే పొరబడినట్టే. వారి పుత్రరత్నాలు సైతం వారిని మించిపోతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే కుమారుడు దర్జాగా చెవిలో బ్లూటూత్ పెట్టుకుని వైద్య పరీక్ష రాశాడు. ఇది గమనించిన ఎగ్జామ్ అబ్జర్వర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, యూనివర్శిటీకి ఫిర్యాదు చేసింది. అయితే, ఆ విద్యార్థి తండ్రి ఎమ్మెల్యే కావడంతో తన పవర్ చూపించారు. ఇపుడు కేసు మాఫీ చేసేందుకు ఏకంగా యూనివర్శిటీ అధికారులే పోటీపడుతున్నారు. ఇందుకోసం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు వైద్య కళాశాలలో హెల్త్‌ వర్సిటీ గతనెలలో మెడికల్‌ పీజీ వార్షిక పరీక్షలు నిర్వహించింది. సెప్టెంబరు 24న జరిగిన పరీక్షలో ఓ విద్యార్థి దర్జాగా చెవిలో బ్లూటూత్‌ పెట్టుకొని సమాధానాలు వింటూ పరీక్ష రాస్తున్నాడు. 
 
వర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వర్‌ (మహిళా వైద్యురాలు) ఆ విద్యార్థిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, జవాబు పత్రాలు తీసుకొన్నారు. కాపీయింగ్‌ చేస్తున్నట్లు కేసు బుక్‌ చేశారు. అదేరోజు హెల్త్‌ వర్సిటీకి ఈ-మెయిల్‌లో సమాచారం ఇచ్చారు.
 
సాధారణంగా ఇలాంటివి జరిగితే ఆ విద్యార్థిని మూడేళ్ల పాటు పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తారు. కానీ పట్టుబడిన విద్యార్థి గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పుత్రరత్నం కావడంతో హెల్త్‌ వర్సిటీకి ఫోన్ల మీద ఫోన్లు వెళ్లాయి. 
 
'ఆ అబ్బాయి చాలా మంచోడట. మీరెందుకు ఫిర్యాదు చేశారని' ఆ మెడికల్‌ కళాశాల యాజమాన్యంపై వర్సిటీ ఉన్నతాధికారి ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇందులో మాకేం సంబంధం లేదు. వర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వర్‌ పట్టుకున్నారు. విద్యార్థి బ్లూటూత్‌ పెట్టుకున్న వైనం అంతా సీసీ టీవీలో రికార్డయిందని'  యాజమాన్యం చెప్పినా సదరు అధికారి శాంతించలేదు. 
 
వైసీపీ ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిళ్లకు లొంగిపోయిన వర్సిటీ ఉన్నతాధికారులు కాపీయింగ్‌ చేసిన విద్యార్థికి క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. నలుగురు వైద్యాధికారులతో విచారణ కమిటీని వీసీ నియమించారు. ఈ కమిటీ ఈ నెల 22వ తేదీన విద్యార్థిని విచారించనుంది. 
 
కాగా, ఆ విద్యార్థి కాపీయింగ్‌కు పాల్పడలేదని, క్లీన్‌చిట్‌ ఇవ్వాలని కమిటీ సభ్యులు అందరికీ ముందుగానే ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విద్యార్థిని పట్టుకున్న మహిళా వైద్యురాలు సిద్ధార్థ కళాశాలకు చెందిన ఆప్తమాలజిస్ట్‌. ఆమె భర్త వర్సిటీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స‌ర‌స్వ‌తీదేవిగా దుర్గ‌మ్మ