తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. సోమవారం నుంచి నామినేషన్లు కూడా దాఖలవుతున్నాయి. వైకాపా నుంచి డాక్టర్ గురుమార్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, టీడీపీ తరపున పనబాక లక్ష్మి, కాంగ్రెస్ తరపున చింతా మోహన్, బీజేపీ - జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా రత్నప్రభలు పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలో అధికార వైకాపా, బీజేపీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. "మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు... ఉప ఎన్నికలో డిపాజిట్లు వస్తే చాలు మనవాడు సీఎం అయిపోతాడన్నట్టు నటిస్తున్నారు" అని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.
"ఎవరి పాత్రల్లో వారు జీవించండి, చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి... జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు" అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు గట్టిగానే కౌంటరిచ్చారు.
"తిరుపతి ప్రజలకు మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజీ పువ్వులు మీకు పంపిస్తాం... బెయిల్ రద్దవగానే లోపల కూరకి ఉపయోగపడతాయి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.