Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్సీ, ఎస్టీ ద్రోహి చంద్రబాబు: శాసనసభలో జగన్‌

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (20:16 IST)
ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు ఒక చరిత్రాత్మక, విప్లవాత్మక నిర్ణయమని, దీని వల్ల వారి వారి సమస్యలపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా ఆయా వర్గాలకు మరింత మేలు జరుగుతుందని, వారి సమస్యలు కూడా సత్వరం పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు హయాంలో దళితులకు పూర్తిగా అన్యాయం జరిగిందని, అప్పుడు సభలో ఒక్క సభ్యుడున్నా కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలిపారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణకు సంబంధించి సీఆర్డీఏ ఇచ్చిన ప్యాకేజీల్లోనూ దళితులకు అన్యాయం జరిగిందని, ఇది వారిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదనడానికి ఒక నిదర్శనమని సీఎం చెప్పారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.
 
ఈ 6 నెలల పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకున్నామని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుకు సంబంధించి సోమవారం శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. చర్చ సందర్భంగా విపక్షనేత చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసి, విమర్శలకు దిగడంతో సీఎం జోక్యం చేసుకున్నారు. 
 
నోరు తెరిస్తే అబద్ధాలే
‘చంద్రబాబునాయుడు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఇంక వేరే మాటలే రావు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పేవాడ్ని, ఇంత దారుణంగా మోసాలు చేసే వారు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప. ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ఉన్నారు అంటే, ఎస్సీలకు, ఎస్టీలకు రెండు కమిషన్లు ఏర్పాటు చేసే గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంటే, ఆ జరిగే కార్యక్రమంలో చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా మాట్లాడారు.

సుదీర్ఘంగా ఆయన మాట్లాడినప్పుడల్లా, మా సభ్యులు ఏం మాట్లాడకుండా వారి స్థానాల్లోనే కూర్చున్నారు. ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన మాటలైపోయిన తర్వాత మా వాళ్లు మాట్లాడారు. మా వాళ్లు మాట్లాడిన తర్వాత ఫినిషింగ్‌గా ముఖ్యమంత్రి జవాబు ఇస్తా ఉన్నాడు. బిల్లు ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తా ఉన్నాడు.

ముఖ్యమంత్రి మాటలు ఎక్కడ బయటకు పోతాయో అని చెప్పి, బయటకు పోకూడదు అని చెప్పి ఆరాటపడుతూ ఏకంగా గొడవ చేయాలి అని చెప్పి.. ఎస్సీలు, ఎస్టీలపై ఈయనకు ఉన్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో వాళ్ల వ్యవహారశైలి చూస్తే అర్ధమవుతుంది’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.
 
ఎస్సీ, ఎస్టీ ద్రోహి
ఇటువంటి దారుణమైన ఎస్సీ, ఎస్టీ ద్రోహి బహుశా ప్రపంచ చరిత్రలోనే ఎవరూ ఉండరేమో ఒక్క చంద్రబాబునాయుడు తప్ప అని సీఎం అన్నారు. 
 
ఏనాడూ ఆ ఆలోచన లేదు
‘ఈ వ్యక్తి చంద్రబాబునాయుడు గారు, ఏపీ స్టేట్‌ కమిషన్‌ గురించి మాట్లాడుతూ, ఈ మనిషి అంటాడు.. ఏపీ స్టేట్‌ కమిషన్‌ 2003లో తెచ్చామని చెబుతున్నాడు. ఆ ఘనత తమది అని చెప్పుకుంటున్న దిక్కుమాలిన పరిస్థితిలో ఈ రాజకీయం ఉంది’. ‘ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఎస్సీ, ఎస్టీని 1992లోనే ఏర్పాటు చేశారు. ఈ పెద్దమనిషి 1995లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏరోజూ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని అనుకోలేదు.

2004 ఎన్నికలకు ముందు మాత్రం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న రాజకీయ ఆలోచనతో 2003లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏపీలో ఏర్పాటు చేశాడు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ 1992లో ఏర్పడితే, 2003 వరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటే, ఎంతటి దారుణమైన ముఖ్యమంత్రి ఈయన అని చెప్పి అర్ధం చేసుకోవడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణే అవసరం లేదు’ అని సీఎం స్పష్టం చేశారు.
 
ఆయనే అలా మాట్లాడితే..
‘ఇంకా ఈ మనిషి అన్న మాటలు.. దళితుల్లో పుట్టాలని, ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చెప్పి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు మాట్లాడడం మొదలుపెడితే, ఇక కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు దళితులకు ఏ మాత్రం గౌరవం ఇస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అలా మాట్లాడితే, దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అంటే ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కసారి ఆలోచన చేయండి’. 
 
‘ఆయన (చంద్రబాబు) గారి క్యాబినెట్‌లోనే ఏకంగా మంత్రి, దళితుల గురించి లోకువగా, తక్కువగా మాట్లాడుతూ, దళితులు స్నానం చేయరు. దళితుల దగ్గర వాసన వస్తుంది అని చెప్పి సాక్షాత్తూ క్యాబినెట్‌లో ఉన్న ఆయన మంత్రే దళితుల గురించి లోకువగా మాట్లాడే పరిస్థితి. అలాంటి మాటలు మాట్లాడినా ఎలాంటి చర్యలు ఉండవు. ఆయన నిస్సిగ్గుగా దళితుల గురించి లోకువగా మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు గారికి దళితుల మీద ప్రేమ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
 
సీఆర్డీఏ ప్యాకేజీలోనూ.. 
‘ఇదే రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న భూములకు సీఆర్డీఏలో ప్యాకేజీలు ఇచ్చారు. ఇదే సీఆర్డీఏ ప్యాకేజీలో ఓసీలకు సంబంధించిన పట్టా భూములకు ఎకరాకు 1000 గజాలు, వాణిజ్య స్థలం మరో 250 గజాలు, అదే వెట్‌ ల్యాండ్‌కు సంబంధించి పట్టా భూములు అయితే ఎకరాకు 1000 గజాలు, వాణిజ్య స్థలం మరో 450 గజాలు అన్నారు.

కానీ అసైన్డ్‌ భూములకు వచ్చే సరికి, ఏదైతే దళితులు, బీసీలు, పేదలకు ఇస్తారో.. ఆ అసైన్డ్‌ భూములకు సంబంధించి.. మిగిలిన పట్టా భూముల్లో మిగతా వారికి 1000 గజాలు ఇస్తే, అసైన్డ్‌ భూములకు సంబంధించిన వారికి మాత్రం కేవలం 800 గజాలు మాత్రమే, అదే విధంగా పట్టా భూములకు సంబంధించి వాణిజ్య స్థలం 250 గజాలు ఇస్తే, అసైన్డ్‌ భూముల్లో కేవలం 100 గజాలే ఇస్తారట. అదే వెట్‌ భూమి అయితే, పట్టా భూములకు రెసిడెన్షియల్‌ 1000 గజాలు, అసైన్డ్‌ భూములైతే రెసిడెన్షియల్‌ కింద 800 గజాలు మాత్రమే ఇస్తారట.

అదే పట్టా భూముల్లో ఇచ్చే వాణిజ్య స్థలం 450 గజాలు అయితే, అసైన్డ్‌ భూముల్లో వెట్‌ ల్యాండ్‌కు సంబంధించి 250 గజాలే ఇస్తారట’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
అడుగడుగునా వివక్ష
అంటే ఎక్కడ చూసినా కూడా దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరైతే అసైన్డ్‌ భూములు పొందిన పేదలు ఉంటారో వారికి ప్రతి దగ్గర వివక్షే కొనసాగిందని సీఎం గుర్తు చేశారు. సాక్షాత్తూ చంద్రబాబు పరిపాలనలో, ఇదే రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏకు సంబంధించిన ప్యాకేజీల వివరాలు ఇవీ అని వివరించిన ఆయన, ఈ మనిషి దళితుల గురించి మాట్లాడతాడని, వారిపై ప్రేమ అంటాడని ఆక్షేపించారు.
 
ఎంతకైనా దిగజారుతాడు
‘చివరకు ఈ పెద్దమనిషి ఎంత దారుణమైన వ్యక్తి అంటే, ఆయనకు రాజకీయంగా ఏది అనుకూలమో, రాజకీయంగా ఏ రకంగా ఓట్ల కోసం ఏం చేస్తే ఓట్లు పెరుగుతాయి అని చెప్పి దుర్భుద్ధి పుడుతుందో ఆ ఓట్ల కోసం అని చెప్పి కులాలనైనా చీల్చేస్తాడు. సొంతం అన్నదమ్ములనైనా చీల్చేస్తాడు.

రాజకీయాల కోసం పిల్లనిచ్చిన సొంత మామను అయినా వెన్నుపోటు పొడిచిన వ్యక్తిత్వం కలిగిన మనిషి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే, ఆయన ఒక్క చంద్రబాబునాయుడుగారు మాత్రమే’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.
 
ఆదరణ లేదనడానికి ఇంతకన్నా..
‘ఈ పెద్దమనిషి మాట్లాడితే దళితుల మీద ప్రేమ అంటాడు. ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 36 సీట్లు ఉంటే.. అంటే 29 సీట్లలో ఎస్సీలు, 7 సీట్లు ఎస్టీలకు కలిపి మొత్తం 36 సీట్లు ఉంటే, వాటిలో ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించి కేవలం ఒకే  ఒక సీటు వచ్చింది. అంటే ఏ స్థాయిలో ఈయన ఉన్నాడో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు’ అని సీఎం గుర్తు చేశారు.
 
100 ఏళ్ల కిందటే గుర్తించారు
ఇలాంటి పెద్దమనుషుల వల్ల దేశం భ్రష్టు పడిపోతుందని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి వంటి పెద్దమనుషులు ఉన్నారని, వారి వల్ల దేశం భ్రష్టు పట్టిపోతుందని చెప్పి, 100 ఏళ్ల కిందట మహాకవి గురజాడ ఒక మాట అన్నారన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆ మాటలను చక్కగా ప్రస్తావించారు.

‘ఎంచి చూడగ మనుషులందున మంచి చెడులు రెండే కులములు. మంచి అన్నది మాల అయితే, నేను ఆ మాల అవుతాను’ అని గురజాడ గారు అన్నారు. ‘100 ఏళ్ల క్రితం ఆయన ఆ మాట అంటే, ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అన్న మాటలు ఏమిటో తెలుసా.. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అంటాడు. 100 ఏళ్ల కిందటి మాటలకు, చంద్రబాబు నాయుడుగారి అన్యాయమైన మాటలకు తేడా ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయండి’ అని ముఖ్యమంత్రి కోరారు.
 
విప్లవాత్మకమైన బిల్లులు
ఈరోజు ఒక విప్లవాత్మకమైన బిల్లులు తెస్తున్నామన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఎస్సీ, ఎస్టీలకు రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసి, ఎస్సీలు, ఎస్టీల సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టి, బాగా అధ్యయనం చేసి,  వారి వారి సమస్యలకు మెరుగైన పరిష్కారం తీసుకురావాలని చెప్పి, విప్లవాత్మకమైన నిర్ణయంతో రెండు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ, బిల్లు తీసుకురావడం జరిగిందని వివరించారు.
 
ఇదేనా విపక్షం తీరు!
‘ఈ 6 నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. చూశారా అధ్యక్షా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో! ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడుతుంటే మాటలు ఎక్కడ బయటకు పోతాయో అని చెప్పి, ఆ మాటలు బయటకు పోవద్దని చెప్పి దిక్కుమాలిన దుర్భుద్ధితో అరుస్తూ ఉన్నారు అంటే, వీళ్లా అధ్యక్షా ఎమ్మెల్యేలు, వీళ్లా అధ్యక్షా నాయకులు. ఇటువంటి వారా అధ్యక్షా పాలకులు కావాల్సింది.. ఒక్కసారి ఆలోచన చేయమని ప్రజలను కోరుతున్నాను. ఇటువంటి వాళ్లను ముందు పెట్టి వెనక ఉండి నవ్వుతున్నాడు’.
 
‘చంద్రబాబునాయుడు గారు. ఎస్సీ, ఎస్టీల మీద ప్రేమ అంటే ఇదేనా? ఒక్కసారి ఆలోచించమని ప్రజలను అడుగుతున్నాను. ఇటువంటి దారుణమైన నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఎంతటి నేరమో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను’ అని సీఎం విజ్ఞప్తి చేశారు.
 
ఈ ప్రభుత్వం ఏమేం చేసింది?
‘ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు పరిపాలన చూశాం. ఇక మా 6 నెలల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు చేయాలని, నిజంగా వారి జీవితాలు మార్చాలని ప్రతి అడుగులోనూ వారికి మంచి చేసే విధంగా అడుగుల వేశాం. అలా చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మాది. చంద్రబాబు నాయుడు దీన్ని చూసి నేర్చుకోవాలి.

క్యాబినెట్‌లో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, అది మా ప్రభుత్వం అని చెప్పి నేను ఇవాళ గర్వంగా చెబుతున్నాను. అయిదుగురు డిప్యూటీ సీఎంలు. ఆ అయిదుగురిలో నలుగురు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అని చెప్పి గర్వంగా చెబుతున్నాను. ఇంకా ఒక దళిత మహిళ ఈ రాష్ట్ర హోం మంత్రిగా ఉందని చెప్పి ఈ వేదికగా గర్వంగా చెబుతున్నాను’ అని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు.
 
అదే చంద్రబాబు ఏం చేశారు?
‘గతంలో చంద్రబాబునాయుడు హయాంలో కనీసం ఒక్క ఎస్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఎన్నికలు వచ్చే సరికి కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వని చరిత్ర చంద్రబాబుది’ అని సీఎం గుర్తు చేశారు.
 
వారందరికీ సముచిత స్థానం
‘ఒక ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత మాది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడని «విధంగా నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్ట్‌ పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత ఒక్క ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే’.
 
‘ఒక్కసారి కృష్ణా జిల్లాను చూడండి. జిల్లాలో 19 మార్కెట్‌ కమిటీలు ఉంటే, వాటిలో 10 కమిటీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన వారే ఉన్నారని ఇవాళ మేము గర్వంగా చెప్పగలం. ఇది మా ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పగలం. గుళ్లలో ఆయా చైర్మన్లుగా కూడా వారిని నియమిస్తున్నాం. నారావారిపల్లెలో గుడిలోకి వెళ్లలేని పరిస్థితిలో దళితులున్నారని ఇప్పుడే మా సోదరుడు చెప్పారు. నేను ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నాను. 50 శాతం గుళ్లలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చైర్మన్లుగా ఉన్నారు’ అని సీఎం వివరించారు.
 
గ్రామ సచివాలయాల్లోనూ.. 
ఇంకా మొన్నటికి మొన్న గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని, దేశంలో ఎక్కడా జరగని విధంగా గ్రామ సచివాలయాల్లో 1.20 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని, వాటిలో 82.5 శాతం ఉద్యోగాల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారని సీఎం గుర్తు చేశారు.
 
చివరగా..
ఈ విధంగా ప్రతి అడుగు ఒక విప్లవాత్మకంగా ముందుకు సాగుతున్నామన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, ఆ దిశలోనే మరో చారిత్రాత్మక నిర్ణయం ఈ బిల్లు అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments