Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతిపై పోరులో 'రివర్స్ టెండరింగ్' విజయాలు

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (17:32 IST)
రాష్ట్రంలో అభివృద్ధి పనుల పేరుతో... తమకు అనుకూలమైన సంస్థలకు... ఎక్సెస్ రేట్లకు టెండర్లను కట్టబెట్టిన గత సర్కార్ అవినీతికి ''రివర్స్ టెండరింగ్'' ద్వారా వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చెక్ పెట్టింది.

వేల కోట్ల రూపాయల పనులను  ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థలకు విచ్చలవిడిగా అధిక రేట్లకు అప్పగించడం ద్వారా... సదరు సంస్థల నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు దండుకున్న గత ప్రభుత్వంలోని పెద్దల ధనదాహంకు అడ్డుకట్ట పడింది. అధికారంలోకి వచ్చిన ఆరునెలల కాలంలోనే ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా వందల కోట్ల రూపాయల వరకు ప్రజాధనం ఆదా అయ్యింది. 
 
సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి మొదలు... పేదలకు అందించే పక్కాగృహాల వరకు... ఇష్టారాజ్యంగా... ఎక్కువ కోట్ చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు పనులను అప్పగించడం ద్వారా గతంలోని చంద్రబాబు ప్రభుత్వం భారీగా ప్రజాధనంను దోచిపెట్టిందనే ఆరోపణలు వున్నాయి. వాస్తవానికి పనుల నిర్మాణ వ్యయం కన్నా పదినుంచి ఇరవై అయిదు శాతం వరకు అధికంగా కోట్ చేసిన సంస్థలకు కూడా ఆనాటి ప్రభుత్వం కాంట్రాక్ట్ లను ఖరారు చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చినట్లయ్యింది.

ఒకవైపు అధిక రేట్లను అంగీకరించడం... మరోవైపు అందుకు ప్రతిఫలంగా సదరు సంస్థల నుంచి భారీగా కమీషన్లను దండుకోవడం కోసం ఈ అక్రమాలకు ప్రభుత్వ పెద్దలు తెగబడ్డారనే విమర్శలు వున్నాయి. దీనివల్ల తక్కువ వ్యయంతో పూర్తి కావాల్సిన నిర్మాణాలకు కోట్లాధి రూపాయల ప్రజాధనం భారీగా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి విభాగంలోనూ ఈ రకంగా జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించింది. ప్రజాధనంను కొల్లగొడుతున్న సంస్థలు, వారి వెనుక వున్న అవినీతి రాజకీయనేతల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రివర్స్ టెండరింగ్ విధానంను ముందుకు తీసుకు వచ్చింది. 
 
రాష్ట్రంలో తొలిసారి రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానం
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రైవేటు వ్యక్తుల ద్వారా పనులను చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తుంది. దీనిలో ఓపెన్ టెండర్లు, బిడ్డింగ్ లు, ఈ ప్రోక్యూర్ మెంట్, ఈ టెండర్లు, నామినేటెడ్ పనులు ఇలా వివిధ విధానాల్లో పనులను అప్పగిస్తూ వుంటారు. అయితే ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది.

టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ పనులను నిర్వహించడంలో విఫలమైనా, అలక్ష్యంగా వ్యవహరించినా సదరు పనులను రద్దు చేసే అధికారం ప్రభుత్వంకు వుంటుంది. అంతేకాకుండా సదరు పనులను దక్కించుకున్న విధానంలో ప్రభుత్వ పెద్దలు, అధికారులతో కుమ్మకై అధిక ధరలను కోట్ చేయడం కూడా ప్రజాధనం దుర్వినియోగానికి కారణమవుతుంది.

ఇటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ పనుల్లో అవినీతిని అరికట్టడానికి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఎంచుకుంది. గతంలోని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం మొదలు అనేక సాగునీటి ప్రాజెక్ట్ లు, మున్సిపల్, ఆర్ అండ్ బి, హౌసింగ్, పంచాయతీరాజ్ పనుల్లో ఎక్సెస్ రేట్లు కోట్ చేసిన సంస్థలకు కూడా పనులను కట్టబెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ముందుకు తీసుకువచ్చింది.

ఏ పనులపై అయితే ఆరోపణలు వున్నాయో... వాటిని వెంటనే నిలుపుదల చేయడం.. మరోసారి సదరు పనులకు టెండరింగ్ నిర్వహించడం... తక్కువ కోట్ చేసిన సంస్థను పేర్కొంటూ.. అంతకంటే తక్కువకు ఎవరైనా పనులు చేసేందుకు ముందుకు వస్తారా అంటూ నిర్మాణ సంస్థలను ఆహ్వానించడం రివర్స్ టెండరింగ్ ప్రకియలో భాగం.

ప్రజాధనంను దుర్వినియోగం కాకుండా చూసేందుకు వైఎస్‌ఆర్ సిపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు జరిగిన అవినీతిని ప్రక్షాళన చేసేందుకు తొలి అడుగుగా మారింది. 
 
పోలవరంలో రివర్స్ టెండరింగ్ తో రూ.782.80 కోట్లు ఆదా
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా ప్రాధాన్యతను సంతరించుకున్న పోలవరం ప్రాజెక్ట్ పనుల్లోనూ గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. ప్రాజెక్ట్ టెండర్ల వ్యవహారంలో ప్రజాధనంను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేందుకు ప్రయత్నించింది. అధికారంలోని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయడంతో పాటు, కాంట్రాక్ట్ సంస్థలకు కట్టబెట్టిన ఎక్సెస్ పనులను పరిశీలించారు. అందుకోసం ప్రత్యేకంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాధమిక పరిశీలనలోనే వేల కోట్ల రూపాయల మేరకు పోలవరం పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు బయటపడింది. దీనితో రాష్ట్రంలోనే తొలిసారిగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రభుత్వం ప్రకటించింది. 
 
పోలవరం ప్రాజెక్టు హెడ్ వ‌ర్క్స్ నుంచి ఎడ‌మ కాలువ‌కు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ ప‌నుల‌కు రివ‌ర్స్ టెండ‌రింగ్ పద్దతిని వర్తింపచేశారు. దాని ద్వారా ఏకంగా రూ. 58 కోట్ల రూపాయాలు ప్రజాధనం ఆదా అయ్యింది. ఈ రివర్స్ టెండరింగ్ లో మొత్తం ఆరు సంస్థలు టెండ‌ర్లు దాఖ‌లు చేయ‌గా, అందులో ఎల్ 1 సంస్థ రూ.260.26 కోట్లకు  టెండ‌ర్ దాఖ‌లు చేసింది. రూ.274 కోట్ల విలువ చేసే ప‌నుల‌ను 6.1 శాతం త‌క్కువ‌కు పూర్తి చేయ‌డానికి అంగీక‌రించిన ఎల్ 1 క‌న్నా ఎవ‌రైనా త‌క్కువ‌కు చేస్తారా అంటూ ప్రభుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వహించింది.

దీంతో రూ.231.47 కోట్లతో ఈ పనులు పూర్తి చేసేందుకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఇది అంచ‌నా విలువ క‌న్నా 15.66 శాతం త‌క్కువ కావడం గమనార్హం. ఈ ఒక్క టెండర్ లోనే గ‌తంలో నిర్వహించిన టెండ‌ర్‌తో పోలిస్తే రూ.58.53 కోట్ల ప్రజాధ‌నం ఆదా అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
 
హెడ్ వ‌ర్క్స్, ప‌వ‌ర్ స్టేష‌న్ టెండర్ల ద్వారా భారీగా ప్రజాధనం ఆదా
తాజాగా కీల‌క‌మైన పోలవరం హెడ్ వ‌ర్క్స్, ప‌వ‌ర్ స్టేష‌న్ ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచారు. రూ. 4,987.55 కోట్ల విలువచేసే ప‌నుల‌కు టెండర్లు పిలువగా.. 12.6 శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు 'మేఘా' సంస్థ ముందుకు వచ్చింది. ఈ పనుల కోసం రూ. 4,358.11 కోట్లు కోట్‌ చేస్తూ మేఘా సంస్థ బిడ్డింగ్‌ వేసింది.

దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా అవుతుందని ప్రాజెక్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో 4.8 శాతం అధిక ధరకు కాంట్రాక్టు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వానికి రూ.154 కోట్ల అదనపు భారం పడిందని, ఇప్పుడు ఆ భారం కూడా తగ్గడంతో ప్రభుత్వానికి మొత్తం రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

పోల‌వ‌రం ప్రధాన డ్యాం వద్ద మిగిలిన రూ. 1,771.44 కోట్ల పనులు, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ. 3,216.11 కోట్ల విలువైన పనులకు సైతం రివర్స్ టెండరింగ్ ద్వారానే టెండ‌ర్లు నిర్వహించారు. 
 
రివర్స్‌‍తో రూ. వందల కోట్లు ఆదా
---------------------------------------------------------------------------------------------------
1. పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం : రూ.782.80 కోట్లు
2. లెఫ్ట్‌ కనెక్టివిటీ (65వ ప్యాకేజీ ) పనులకు : రూ.58.53 కోట్లు
3. జెన్‌ కో బొగ్గు రవాణా : రూ. 186 కోట్లు
4. వెలిగొండ రెండో టన్నెల్‌ మిగిలిన పనులకు : రూ. 61.76 కోట్లు
5. డెస్క్‌ టాప్‌ కంప్యూటర్లు , ప్రింటర్ల కొనుగోలు : రూ. 65 .47 కోట్లు
6. జెన్‌కో బొగ్గు పర్యవేక్షణ : రూ. 25 కోట్లు
7. 4జీ సిమ్‌ కార్డులు పోస్ట్‌ పైడ్‌ : రూ. 33 .77 కోట్లు
8. పోతురాజు నాలా డ్రైన్‌ అభివృద్ధి : రూ. 15 .62 కోట్లు
9. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలుకు : రూ.83.80 కోట్లు
10. ఏపీ టిడ్కోలో రివర్స్‌ టెండరింగ్ : రూ. 303.31 కోట్లు
11. అల్లూరుపాడు ప్రాజెక్ట్‌ పనుల్లో రివర్స్‌  టెండరింగ్‌ : రూ. 67.81 కోట్లు అదా
13. రూ.503  కోట్ల సోమశిల ప్రాజెక్ట్‌ లో రివర్స్‌ టెండరింగ్‌ : రూ. 67.9  కోట్లు
14. గాలేరీ-నగరి రెండో దశ తొలి ప్యాకేజీలో : రూ.35.3 కోట్లు ఆదా
15. గాలేరు-నగరి రెండోదశ రెండో ప్యాకేజీలో : రూ.33.57 కోట్లు ఆదా
-------------------------------------------------------------------------------------------------
 
పేదల ఇళ్ళ నిర్మాణంలోనూ భారం తగ్గించిన రివర్స్ టెండరింగ్
రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం అందించే పక్కాగృహాల నిర్మాణంలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. అధికరేట్లకు టెండర్లకు ఆమోదం తెలపడం ద్వారా అటు ప్రజాధనంను దుర్వినియోగం చేయడంతో పాటు, ఇటు సబ్సిడీ తరువాత లబ్దిదారులు తమవంతుగా తిరిగి చెల్లించాల్సిన సొమ్మును కూడా అధికం అయ్యేలా చేశారు.

ఈ విధానంపై వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి సారించింది. దీనితో ఏకంగా రూ. 303.31 కోట్ల రూపాయల ఆదా జరిగింది. ఎపి టౌన్ షిప్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్‌ (టిడ్కో) లో రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టిడ్కో ద్వారా చేపట్టిన గృహనిర్మాణంకు సంబంధించి తొలిదశలో 14,368 ఇళ్ల నిర్మాణంకు నిర్వహించిన రివర్స్ టెండరిగ్ ద్వారా రూ. 105.91 కోట్లు, రెండో దశ లో 6,596 ఇళ్ళ నిర్మాణం కోసం జరిగిన రివర్స్ టెండరింగ్ లో రూ. 46.03 కోట్లు, మూడోదశలో 19,296 ఇళ్లకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో 103.89 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.

తాజాగా నాలుగోదశలో 8,448 ఇళ్ళ నిర్మాణం కోసం రూ.431.62 కోట్ల పనులకు చేపట్టిన రివర్స్ టెండరింగ్ లో ఇంద్రజిత్ మెహతా కన్ స్ట్రక్షన్‌ కంపెనీ రూ.384.14 కోట్లకు బిడ్ ను దక్కించుకుంది. ఫలితంగా రూ.47.48 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయ అయ్యింది. మొత్తం 48,608 పక్కాగృహాలకు గానూ రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ.303.31 కోట్ల రూపాయలు ఆదాయ అయ్యాయి. పాతరేట్లకే టెండర్లను అంగీకరించి వుంటే... టిడ్కో ఇళ్ళను పొందిన పేదలు ఒక్కొక్కరి మీద దాదాపు రూ.75 వేల నుంచి రూ. 95 వేల వరకు భారం పడేది.  
 
సాగునీటి ప్రాజెక్ట్ ల్లో రివర్స్ టెండరింగ్
రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్ట్ ల్లోనూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలుగు గంగ లైనింగ్ పనులకు గత ప్రభుత్వం అధిక ధరలకు పనులను కట్టబెట్టడం వల్ల దాదాపు 30.81 కోట్ల రూపాయల వరకు భారం పడిందని అధికారులు అంచనా వేశారు.

రివర్స్ ద్వారా ఈ భారంను తగ్గించేందుకు అవకాశం వుందని సాగునీటి అధికారులు భావిస్తున్నారు. సోమశిల రెండోదశ కెనాల్ పనుల్లో కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా 67.9 కోట్ల రూపాయలు ఆదా అయ్యింది. బీవిఎస్సార్ కన్ స్ట్రక్షన్‌ ఈ టెండరింగ్ లో 8.69 శాతం తక్కువకు ఈ పనులను దక్కించుకుంది. గాలేరు-నగరి రెండో దశ తొలి ప్యాకేజీలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.35.3 కోట్ల రూపాయల మేరకు ఆదా అయ్యింది.

మొత్తం రూ.391.13 కోట్ల వ్యయంతో ఈ పనులకు టెండర్లు నిర్వహించారు. దీనిలో 5.04 శాతం తక్కువతో రూ.371.43 కోట్లకే కాంట్రాక్ట్ సంస్థ పనులను దక్కించుకుంది. ఇవే పనులను గతంలో అప్పటి ప్రభుత్వం తమ ఎంపీ సీఎం రమేష్‌ కు చెందిన సంస్థకు రూ.406.73 కోట్లకు కట్టబెట్టింది. దీనివల్ల ఖజానాపై రూ.15.6 కోట్ల రూపాయల భారం పడింది. అలాగే గాలేరు-నగరి రెండోదశ ప్యాకేజీకి సంబంధించి తాజాగా రూ.349.97 కోట్ల రూపాయల పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించారు.

ఈ టెండర్లలో 5శాతం తక్కువకే పనులను కాంట్రాక్టు సంస్థ బిడ్డింగ్ దక్కించుకుంది. ఫలితంగా రూ.33.57 కోట్లు ఆదా అయ్యింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇవే పనులను 4.76 శాతం అధిక ధరలకు పనులను కట్టబెట్టింది. అల్తూరుపాడు ప్రాజెక్ట్ పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.67.81 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనం ఆదా అయ్యింది.

సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ అంతర్భాగమైన అల్తూరుపాడు రిజర్వాయర్‌ పనులకు గానూ రూ.253.77 కోట్లతో గతంలో టిడిపి ప్రభుత్వం టెండర్లను ఆమోదించింది. ఇదే పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో 14.06 శాతం తక్కువకు అంటే రూ.218.09 కోట్లకు ఖరారు అయ్యింది. దీనిద్వారా ఖజానాపై దాదాపు 35.68 కోట్ల రూపాయలు భారం తగ్గింది. 
 
సెల్ ఫోన్లు, సిమ్ కార్డుల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ ఆదా
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల సిబ్బంది, గ్రామ, వార్డు వాలంటీర్లకు సెల్ ఫోన్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సెల్ ఫోన్లు, సిమ్ కార్డులకు టెండర్లు నిర్వహించింది. అయితే ఇందులోనూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను అనుసరించింది. మొత్తం 2.64 లక్షల ఫోన్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం నిర్వహించిన టెండర్లలో ఒక సంస్థ రూ. 317.61 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. మరోసంస్థ రూ.233.81 కోట్లుతో బిడ్ దాఖలు చేసింది. దీంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించగా 26.4శాతం తక్కువకే టెండర్ ఖరారు అయ్యింది. దీనివల్ల దాదాపు రూ.83.80 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది.

అలాగే  4-జి సిమ్‌ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ ద్వారా.. 33 కోట్ల 76 లక్షల రూపాయలు ఆదా అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రభుత్వం.. 2,64,920 ఫోన్ లకు 4-జి  సిమ్ కార్డులు కొనుగోలు చేస్తోంది. ఎల్‌-1 గా వచ్చిన సంస్థ రూ. 121.54 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా రూ. 87.77 కోట్లకే ఒప్పందం ఖరారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments