జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్ ద్వారా జనసైనికులు, యువతీయువకులు, ప్రజలకు మరింత చేరువవుతున్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఫేస్ బుక్‌లో అఫీషియల్ పేజీని ప్రారంభించారు. ఈ పేజీ ద్వారా పార్టీ సిద్దాంతాలు, తన ఆలోచనలను పంచుకుంటారు.
పార్టీ కార్యక్రమాలను కూడా తెలియచేస్తారు. ఈ పేజీలో తొలి విషయంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన అప్‌డేట్ పోస్ట్ చేశారు. నవంబర్ 2వ తేదీన విజయవాడ నుంచి తుని పట్టణానికి రైలులో చేరుకుంటున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా కొన్ని స్టేషన్లలో వివిధ వర్గాల ప్రతినిధులను కలుసుకుంటానని చెప్పారు.
సేనానితో రైలు ప్రయాణం
జన్మభూమి రైల్లో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తారు. 'సేనానితో రైలు ప్రయాణం' పేరుతో పలు వర్గాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడతారు. విజయవాడ నుంచి తుని చేరుకొనే వరకూ పలు వర్గాల ప్రజలతో మాటామంతీ ఉంటుంది. మధ్యాహ్నం 1 గం. 20 ని.లకు రైల్వే పోర్టర్లతో మాట్లాడతారు. ఆ తరవాత మామిడి రైతులు, అసంఘటిత రంగంలో ఉన్న చిరు వ్యాపారులు, రైల్వే వెండర్లతోపాటు, రైలులోని ప్రయాణికులు, చెరకు రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారులతో ఈ ప్రయాణంలో మాట్లాడతారు.