విశాఖపట్టణం జిల్లా అరకు లోయలో విషాదం జరిగింది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పదంగా మృతి చెందింది. తల్లి ఓ గదిలో ఉరి వేసుకొని చనిపోగా.. ముగ్గురు చిన్నారులు మరో గదిలో మంచంపై విగతజీవులుగా పడివున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అరకులోయ పట్టణ పరిధిలోని పాత పోస్టాఫీస్ కాలనీలో సంజీవ్, సురేఖ(28) దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారై సుశాన(9), కుమారులు షర్విన్(6), సిరిల్(4) సంతానం. గిరిజన సహకార సంస్థలో ఒప్పంద సేల్స్‌మెన్‌గా సంజీవ్ పనిచేస్తున్నాడు.
అయితే, గత కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో సంజీవరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ముగ్గురు చిన్నారులు మంచంపై విగతజీవులుగా కనిపించగా.. భార్య మరో గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది.
స్థానికుల సాయంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే.. వారు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. భార్య ఉరివేసుకుందని భర్త సంజీవ్ చెబుతున్నాడు. అయితే.. ముగ్గురు పిల్లలను చంపి.. భార్యకు ఉరి వేసి వారిని తన అల్లుడే హత్య చేశాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.