ఏపీ అసెంబ్లీ ఆవరణలోకి సెల్ ఫోన్లు తేరాదని నిబంధనలున్నాయి. అయితే, ఇది మీడియా వారికి మాత్రమే అని గతంలో షరతులు విధించారు. అందుకే, ఏపీ అసెంబ్లీ మీడియా ఛాంబర్ లోకి కూడా సెల్ ఫోన్లు అనుమతించరు. విలేకరులు తమ సెల్ ఫోన్లను అసెంబ్లీ మార్షల్స్ వద్ద డిపాజిట్ చేసి, కేవలం పెన్ను, పుస్తకంతో మాత్రమే అసెంబ్లీ, లేదా మండలి మీడియా గ్యాలరీలోకి వెళ్ళాల్సి ఉంటుంది.
కానీ, ఇపుడు ఆ నిబంధనను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర అసెంబ్లీ సభ్యులందరికీ వర్తింపజేస్తూ, తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలోకి సభ్యులు ఎవరూ సెల్ ఫోన్ లు తేరాదని నిబంధన విధించారు. అంటే, అమరావతి అసెంబ్లీలో సభ్యుల ఫోన్ల అనుమతికి చెక్ చెప్పారు. సభలో సభ్యులు ఫోన్లు తీసుకుని రావడానికి ఇక నుంచి అనుమతి లేదని హౌస్ లోనే స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.
దీనికి నేపథ్యం ఇటీవల అసెంబ్లీ జరిగిన రాద్దాంతమే. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన సతీమణిని దూషించారంటూ, ఇటీవల అసెంబ్లీలో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీ సభ్యులపైనా, మంత్రులపైనా ...చివరికి స్పీకర్ పైనా, విరుచుకుపడ్డారు. అపుడు చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం వివాదాస్పదమైంది.
చంద్రబాబు అరుస్తూ, వైసీపీ సభ్యులపై విరుచుకుపడిన సమయంలో ఆయన వెనక నుంచి తోటి టీడీపీ సభ్యులే సెల్ ఫోన్ లో వీడియో రికార్డింగులు చేసి, బయట తమ అనుకూల మీడియాకు పంపారు. కొందరైతే, వాటిని నేరుగా తమ సోషల్ మీడియా ఖాతాల్లోకి పోస్టింగ్ చేశారు. దీనితో ఆ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ తాజా నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలోకి స్మార్ట్ ఫోన్లు అనుమతి లేదని తెగేసి చెప్పారు స్పీకర్ తమ్మినేని.