ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విపక్ష నేత, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమా నటులను, దర్శకులను పక్కనబెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని జగన్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీరుడు రాజమౌళిని పరోక్షంగా దెప్పిపొడిచారు.
బాహుబలి దర్శకుడు రాజమౌళిని కూడా అమరావతికి పిలిపించుకున్నారని... ఒక్క ఇటుక కూడా పడని అమరావతిపై ఆయన సినిమా తీయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అందులో తన పాత్రను, మంత్రి నారాయణ పాత్రను బాగా చూపించాలని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లోకి వస్తున్న సినీ నటులను నిలదీయాలంటూ జగన్ ప్రజలను కోరారు.
చంద్రబాబు పాలన మొత్తం.. అసత్యాలు, మోసాలతోనే కొనసాగుతుందని దుయ్యబట్టారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 14వ తేదీకి జగన్ పాదయాత్ర 34వ రోజుకు చేరింది. గురువారం జరిగిన ఓ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రజల్లో చైతన్యం రావాలని.. అప్పుడు చంద్రబాబు లాంటి వాళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతారని తెలిపారు. తాను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని చంద్రబాబు చెప్పడంపై జగన్ తప్పుబట్టారు.