డ్రైవర్ నిర్లక్ష్యానికి 17 నెలల పాప బలైపోయింది. మరో రోడ్డులోకి వెళ్లడానికి టర్న్ తీసుకుంటూ చిన్నారని గుద్దేశాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం హైదరాబాద్ చాంద్రాయణగుట్ట స్టేషన్ పరిధి నర్కిఫూల్‌బాగ్ బస్తీలో చోటుచేసుకుంది.
స్థానికంగా మహమూద్ బావజీర్(33) అనే వ్యక్తి కుటుంబంతోపాటు నివసిస్తున్నాడు, కాగా అతనికి ముగ్గురు కుమార్తెలు. చివరి కుమార్తె అమీరా బావజీర్‌ను తండ్రి గురువారం సాయంత్రం బజారుకు తీసుకువెళ్లాలనుకున్నాడు. ఇంతలో చిన్నారి తాత నమాజు చేయడానికి మసీదుకు వెళ్లడానికి బయలుదేరాడు. ఇద్దరూ బయటకు రావడంతో అటుగా పచ్చగడ్డి లోడుతో ఆటో ట్రాలీ వస్తుండటం గమనించాడు. ఇటు వెళ్లడానికి మార్గం లేదని మరో మార్గంలో వెళ్లాలని డ్రైవర్‌కి చెప్పాడు.
ఆ తర్వాత మసీదులోకి వెళ్లిపోయాడు. చిన్నారి అక్కడే ఉంది. ఆదే వాహనం మనుమరాలిని బలి తీసుకుంది. మరో మార్గంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ టర్న్ తీసుకుంటుండగా వెనుకకు వచ్చి ఆడుకుంటున్న పాపను గుద్దేశాడు. డ్రైవర్ అక్కడ నుండి వెంటనే పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తాత, తండ్రి, కుటుంబ సభ్యులు బోరున విలపించసాగారు.
అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అంటూ తీవ్రంగా బాధపడ్డారు. బంధువులంతా ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మతపెద్దలు, మజ్లిస్ నేత సమద్ బిన్ అబ్దాద్, మహ్మద్ షఫియుద్దీన్ వారిని ఓదార్చడానికి ప్రయత్నించారు.