తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచేస్తున్నాయి. రాగల 48 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు.
నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతుండగా, వాటికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 48 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు.
కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మబ్బులు కమ్మేయగా, పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. నేడు, రేపు అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా తెలంగాణలో వానలు అధికంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ ఒడిశా వరకూ అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లాల వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రుతుపవనాలు, ఆవర్తనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
తెలంగాణలోని వరంగల్, జయశంకర్, యాదాద్రి, కరీంనగర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మంచిర్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నంద్యాలలో కురిసిన భారీ వర్షం రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారానికి అడ్డంకులు కల్పించింది.